Shraddha Murder: శ్రద్ధాను చంపినందుకు నేనేం బాధపడట్లేదు.. పాలిగ్రాఫ్‌ టెస్టులో ఆఫ్తాబ్‌..!

శ్రద్ధా వాకర్‌ను తాను హత్య చేసినట్లు నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా పాలిగ్రాఫ్‌ పరీక్షల్లోనూ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇందుకు తానేమీ బాధపడట్లేదని కూడా చెప్పినట్లు సమాచారం.

Updated : 30 Nov 2022 11:31 IST

దిల్లీ: సంచలనం సృష్టించిన కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలాకు ఇటీవల పాలిగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించారు. కాగా.. ఈ టెస్టులో ఆఫ్తాబ్‌ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. పాలిగ్రాఫ్‌ టెస్టు సమయంలో శ్రద్ధాను తానే హత్య చేశానని అంగీకరించిన ఆఫ్తాబ్‌.. అందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదని, బాధ పడటం లేదని చెప్పినట్లు దర్యాప్తు బృందం వర్గాలు వెల్లడించాయి.

హత్య తర్వాత శ్రద్ధాను ముక్కలు చేసి ఆమె శరీర భాగాలను అడవిలో పడేసిన విషయాన్ని కూడా ఆఫ్తాబ్‌ పాలిగ్రాఫ్‌ సెషన్‌లో చెప్పినట్లు తెలిసింది. ఇక తనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని నిందితుడు అంగీకరించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. పాలిగ్రాఫ్‌ పరీక్షల సమయంలో ఆఫ్తాబ్‌ ప్రవర్తన చాలా సాధారణంగా ఉందట. శ్రద్ధ హత్యకు సంబంధించిన అన్ని వివరాలను తాను ఇప్పటికే పోలీసులకు చెప్పానని నిందితుడు పదేపదే చెప్పినట్లు సమాచారం. అయితే, శ్రద్ధాను హత్య చేసినట్లు ఆఫ్తాబ్‌.. ఆ మధ్య కోర్టు ముందు కూడా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి.

రేపే నార్కో పరీక్ష..

ఆఫ్తాబ్‌ పాలిగ్రాఫ్‌ పరీక్షకు సంబంధించి తుది నివేదిక ఇంకా రాలేదు. అతడికి నార్కో పరీక్ష జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆఫ్తాబ్‌ నార్కో పరీక్ష కోసం పోలీసులు దరఖాస్తు చేసుకోగా.. కోర్టు అందుకు అనుమతినిచ్చింది. డిసెంబరు 1, 5 తేదీల్లో దిల్లీలోని రోహిణి ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, పాలిగ్రాఫ్‌, నార్కో అనాలసిస్‌లో నిందితుడు ఇచ్చే వాంగ్మూలాన్ని ప్రధాన సాక్ష్యాలుగా పరిగణించరు. కేవలం వాటిని ఆధారాలుగా మాత్రమే తీసుకుంటారు. అయితే ఈ పరీక్షల్లో నిందితుడు చెప్పే విషయాలతో కేసును ముందుకు తీసుకెళ్లే ఆధారాలేమైనా లభించే అవకాశాలుంటాయి. ఇదిలా ఉండగా.. ఈ కేసులో శ్రద్ధా డీఎన్‌ఏ పరీక్షకు సంబంధించిన నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఆ నివేదిక వస్తేనే గానీ ఈ హత్య కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పించట్లేదు.

28 ఏళ్ల ఆఫ్తాబ్‌.. తన ప్రియురాలు శ్రద్ధా వాకర్‌ను చంపి 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచి పెట్టి.. రాత్రిపూట దిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసిన ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నవంబర్‌ 12న నిందితుడిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని