10 లేఖలు రాశా.. ఒక్కదానికీ సీఎం స్పందించలేదు: పంజాబ్‌ గవర్నర్‌

సీఎం భగవంత్‌ మాన్‌కు పది లేఖలు రాసినా.. ఒక్కదానికీ సమాధానం ఇవ్వలేదని పంజాబ్‌ గవర్నర్‌  భన్వరిలాల్‌ పురోహిత్‌ అన్నారు.

Published : 12 Jun 2023 23:41 IST

చండీగఢ్‌: పంజాబ్‌ గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌(Banwarilal Purohit), సీఎం భగవంత్‌ మాన్‌(Bhagwant Mann ) మధ్య నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని ఆప్‌(AAP) ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌ ఆక్షేపించారు. పలు అంశాలపై సమాచారం కోరుతూ సీఎంకు 10 లేఖలు రాసినా స్పందించలేదని మండిపడ్డారు. సోమవారం  చండీగఢ్‌లో గవర్నర్‌ మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ కోరిన సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ  భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం తన లేఖలకు సమాధానం ఇవ్వడంలేదన్నారు. ‘‘సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలేంటో మీకు తెలుసు. గవర్నర్‌ ఏది అడిగినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎంకు 101శాతం ఉంటుందని పేర్కొంది. అంతేకాదు.. కోర్టు ఆర్డర్‌లో లిఖితపూర్వకంగా ఉంది’’ అని విలేకర్లతో అన్నారు. తాను పలు అంశాలపై సమాధానం కోరితే.. సీఎం భగవంత్‌మాన్‌ మాత్రం తమ ప్రభుత్వం కేవలం మూడు కోట్ల మంది పంజాబీలకు మాత్రమే  జవాబుదారీ అని చెబుతున్నారని ఈ సందర్భంగా గవర్నర్‌ గుర్తు చేశారు. 

ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ గవర్నర్‌ ముఖ్యమంత్రికి పలుమార్లు లేఖలు రాశారు. ఫిబ్రవరిలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లను సింగపూర్‌ పర్యటనకు ఎంపిక చేయడం సహా పలు అంశాలపై గవర్నర్‌ వివరాలు కోరారు. ఇలాంటి అంశాల విషయంలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య దూరం పెరిగింది.  అయితే, అసెంబ్లీలో గవర్నర్‌ తన ప్రసంగంలో ‘నా ప్రభుత్వం’ అని పలికేందుకు నిరాకరించారా? అని మీడియా ప్రశ్నించగా గవర్నర్‌ సమాధానం ఇచ్చారు. ‘‘అన్ని ఉత్తర్వులూ గవర్నర్‌ పేరుతోనే జారీ అవుతున్నాయి.. అలాంటప్పుడు నాది అనడానికి నాకేంటీ ఇబ్బంది. కావాలంటే 50సార్లయినా పలుకుతా’’ అని అన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో పంజాబ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు అనుమతి ఇస్తారా? అన్న ప్రశ్నకు స్పందించిన భన్వరిలాల్‌ అనుమతి ఇస్తానని.. తనకు ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని