AAP: కేజ్రీవాల్‌ అరెస్టుపై ఆప్‌ సోషల్‌ మీడియా ‘డీపీ క్యాంపెయిన్‌’

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా కొనసాగిస్తున్న ఉద్యమంలో భాగంగా ఆప్‌ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు క్యాంపెయిన్‌ ప్రారంభించింది.

Published : 25 Mar 2024 19:35 IST

దిల్లీ: దిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్‌ (AAP) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ ఆందోళనలు కొనసాగిస్తోంది. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాము సాగిస్తున్న పోరాటంలో ప్రజల మద్దతు కోరుతూ సోషల్‌ మీడియా ‘డీపీ క్యాంపెయిన్‌’ను ప్రారంభించింది. ఈసందర్భంగా దిల్లీ మంత్రి, ఆప్‌ నేత అతిశీ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నేతలు, వాలంటీర్లంతా ‘ఎక్స్‌’, ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమ ఖాతాల్లో కేజ్రీవాల్‌ కస్టడీలో ఉన్న ఫొటోను డిస్‌ప్లేలో మార్చుకుంటారని.. ప్రజలు సైతం ఈ క్యాంపెయిన్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేజ్రీవాల్‌ జైలులో ఉన్నట్లుగా చూపించే ఆ ఫొటోపై ‘మోదీకి అతిపెద్ద భయం కేజ్రీవాల్‌’ అని రాసి ఉంటుందని పేర్కొన్నారు.

లాకప్‌లో కంప్యూటర్‌, పేపర్‌ ఇవ్వలేదు.. కేజ్రీవాల్‌ ఆదేశాలు ఎలా జారీ చేశారు..!

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు అతిశీ తెలిపారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపెయిన్‌ మొదలుకాగా.. ఆప్‌ నేతలు, కార్యకర్తలు తమ డీపీలు మార్చుకొంటున్నారన్నారు. ఈ క్యాంపెయిన్‌లో పాల్గొని తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఫొటోను డిస్‌ప్లే చేయాలని కోరారు. దేశంలో మోదీని సవాల్‌ చేయగల నేత కేజ్రీవాల్‌ ఒక్కరేనన్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎలాంటి ఆధారాల్లేకుండా ఈడీతో ఆయన్ను అరెస్టు చేయించారని ఆమె ఆరోపించారు. కేజ్రీవాల్‌ను భాజపా నకిలీ కేసుల్లో ఇరికించి.. ఈడీని ఉపయోగించి కటకటాల్లోకి నెట్టిందన్నారు. ఈ కేసులో ఈడీ రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా ఒక్క పైసాకు సంబంధించిన ఆధారాలు కూడా సంపాదించలేకపోయిందని ఆరోపించారు. భాజపా, మోదీ కేజ్రీవాల్‌ను అణిచివేయాలని చూస్తున్నారని.. దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆప్‌ యుద్ధం చేస్తోందన్నారు. దిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు మార్చి 21న రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 28 వరకు ఆయన్ను రౌస్‌ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని