Arvind Kejriwal: లాకప్‌లో కంప్యూటర్‌, పేపర్‌ ఇవ్వలేదు.. కేజ్రీవాల్‌ ఆదేశాలు ఎలా జారీ చేశారు..!

తమ కస్టడీ నుంచి దిల్లీ సీఎం ఆదేశాలు జారీ చేశారంటూ ఆప్‌ చెప్పడాన్ని ఈడీ తీవ్రంగా తీసుకొంది. మంత్రి ఆతిశీని ప్రశ్నించడంతో సహా కేజ్రీవాల్‌ కదలికలను పరిశీలించేందుకు సీసీటీవీ దృశ్యాలను కూడా వెలికి తీయనుంది.  

Updated : 25 Mar 2024 13:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఆదేశాలు జారీ చేశారంటూ దిల్లీ మంత్రి ఆతిశీ మార్లీనా నిన్న విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలంటూ ఓ కాగితం ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్‌ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆ కాగితం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొనేందుకు ఆప్‌ మంత్రి ఆతిశీ మార్లీనాను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు జైల్లో కేజ్రీవాల్‌ కదిలికలను గమనించేందుకు సీసీ టీవీ దృశ్యాలను కూడా పరిశీలించవచ్చని చెబుతున్నారు. 

భాజపా కేజ్రీవాల్‌కు భయపడుతోంది..: సంజయ్‌ రౌత్‌

కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని శివసేన ఉద్ధవ్‌ వర్గానికి చెందిన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఎద్దేవా చేశారు. రామ్‌లీలా మైదానంలో ఆప్‌ తలపెట్టిన భారీ ర్యాలీకి హాజరవుతామని ఆయన వెల్లడించారు. జైలు నుంచే విధులు నిర్వర్తిస్తుండటంతో భాజపాకు కేజ్రీవాల్‌ మరింత ప్రమాదకరంగా తయారయ్యారని పేర్కొన్నారు. ప్రజలకు ఆయన చెప్పేది వినటమే కాదు.. మద్దతుగా తరలివస్తారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కూడా జైలుకు వెళ్లిన నాయకులు బలంగా తిరిగి వచ్చారన్నారు. 

పీవోకే భారత్‌లో విలీనమవుతుంది

మరోవైపు రామ్‌లీలా మైదానంలో 1.5లక్షల మందితో భారీ సభను ఏర్పాటు చేయడానికి ఆమ్‌ఆద్మీ పార్టీ సన్నాహాలు చేస్తోంది. దీనిపై పార్టీ కార్యదర్శి సందీప్‌ పాఠక్‌ నాయకులకు మార్గదర్శకాలను జారీ చేశారు. మార్చి 27,28న ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లతో కలిపి జోనల్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి బూత్‌ నుంచి 10 మంది మార్చి 31వ తేదీన రామ్‌లీలా మైదానం చేరుకొనేలా చూడాలన్నారు. దిల్లీలోని 14,000 బూత్‌ల నుంచి 1.5 లక్షల మంది హాజరవుతారని పాఠక్‌ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని