AAP: 100మంది ఎంపీలు.. ఎంతో ప్రచారం.. అయినా మేమే గెలిచాం!

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే భాజపా, ఓ చిన్న పార్టీ చేతిలో ఓటమి పాలయ్యిందని ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ ఓటమికి కాషాయ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. దిల్లీవాసులు మాత్రం ఆమ్‌ఆద్మీవైపే ఉన్నారని అన్నారు.

Published : 08 Dec 2022 01:42 IST

దిల్లీ: దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో (MCD Elections) సత్తా చాటిన ఆమ్‌ఆద్మీపార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది.ఈ నేపథ్యంలో భాజపాపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు విసిరింది. అపరిమిత శక్తి, ముఖ్యమంత్రులు, దర్యాప్తు సంస్థల బలం, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే భాజపా ఓ చిన్న పార్టీ చేతిలో ఓడిపోయిందని విమర్శలు గుప్పించింది.

‘పేద, నిజాయితీ కలిగిన, విద్యావంతమైన ఓ చిన్న పార్టీ.. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీని ఓడించింది. భాజపా, ఆమ్‌ఆద్మీపార్టీ మధ్య జరిగిన హోరాహోరీ పోరు ఇది. ఏడుగురు ముఖ్యమంత్రులు, 17మంది కేంద్ర మంత్రులు, 100 మంది ఎంపీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ, ఐటీలతోపాటు జైల్లో ఉన్న ఓ వ్యక్తి (సుకేశ్‌ చంద్రశేఖర్‌) కూడా ఎన్నికల్లో వారి ముఖ్య ప్రచారకర్తలు (Star Campaigner). అయినప్పటికీ సామాన్యుడి చేతిలో ఓడిపోయారు’ అని ఆ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా పేర్కొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) విజయాన్ని ఆపాలని భాజపా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అభివృద్ధి కోసం పనిచేసిన వారికే దిల్లీ పౌరులు ప్రభుత్వ పగ్గాలు అప్పజెప్పారన్నారు. కేజ్రీవాల్‌పై భాజపా చల్లుతున్న బురదను తుడిచేసిన దిల్లీవాసులు.. తాజాగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ బాధ్యతలను కూడా ఆయనకే కట్టబెట్టారని రాఘవ్‌ చద్దా స్పష్టం చేశారు.

మరోవైపు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 15 ఏళ్ల భాజపా పాలనకు అడ్డుకట్ట వేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ.. స్పష్టమైన మెజారిటీతో  జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో ఆప్‌ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. దీంతో మేయర్‌ సీటు ఆమ్ ఆద్మీ వశమైంది. ఈ ఎన్నికల్లో భాజపా 104 వార్డులను గెలుచుకోగా.. హస్తం పార్టీ కేవలం 9 స్థానాలకు పరిమితమైంది. మరో మూడు చోట్ల ఇతరులు విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని