AAP: త్వరలో దిల్లీలో రాష్ట్రపతి పాలన..! ఆతిశీ సంచలన ఆరోపణలు

దిల్లీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆప్‌ నేత ఆతిశీ(Atishi) ఆరోపణలు చేశారు. 

Updated : 12 Apr 2024 16:36 IST

దిల్లీ: ఆప్‌ నేతలు మరోసారి సంచలన ఆరోపణలకు తెరతీశారు. రానున్న రోజుల్లో దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు భాజపా (BJP) యత్నిస్తోందని వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని దిల్లీ మంత్రి ఆతిశీ(Atishi) ఆందోళన వ్యక్తం చేశారు. 

‘‘ఎలాంటి ఆధారాలు లేకుండా కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో అరెస్టు చేశారు. ఎందుకంటే దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోంది. గతంలోని అనుభవాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ.. అధికారులను కేటాయించడం లేదు. ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి అధికారులు సమావేశాలకు హాజరుకావడం మానేశారు. ఈ కుట్రలో భాగంగానే సీఎం వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్‌)ని పదవి నుంచి తొలగించారు’’ అని ఆమె మీడియాతో మాట్లాడారు. 

ఈడీ కేసుల్లో 3 శాతమే రాజకీయ నాయకులవి: ప్రధాని మోదీ

ఈ ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. ‘‘ఆ పార్టీ ప్రతిరోజు కొన్ని అందమైన కథల్ని వండి వార్చుతుంది’’ అని ఎద్దేవా చేసింది. ఇదిలా ఉంటే..  మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయి జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా.. సీఎం పీఎస్‌ వైభవ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు దిల్లీ ప్రభుత్వ విజిలెన్స్‌ విభాగం ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని