Aditya L1: ఆదిత్య తీసిన ‘సూర్యుడి’ అరుదైన చిత్రాలు!

సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) పంపించిన ఆదిత్య-ఎల్‌1 (Aditya L1).. మరిన్ని అరుదైన చిత్రాలను ఆవిష్కరించింది.

Updated : 08 Dec 2023 21:27 IST

బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) పంపించిన ఆదిత్య-ఎల్‌1 (Aditya L1).. మరిన్ని అరుదైన చిత్రాలను ఆవిష్కరించింది. అతినీలలోహిత తరంగ దైర్ఘ్యం చేరువ నుంచి సూర్యుడి చిత్రాలను బంధించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇస్రో షేర్ చేసింది. సౌరకుటుంబ పరిశోధనలో ఇదో కీలక మైలురాయి అని అభివర్ణించింది.

ఆదిత్య-ఎల్‌1లోని సోలార్‌ అల్ట్రావయోలెట్‌ ఇమేజింగ్‌ టెలీస్కోప్‌ (SUIT) పేలోడ్‌.. సూర్యుడి 200 నుంచి 400 నానో మీటర్ల తరంగదైర్ఘ్య పరిధిలోని చిత్రాలను తీసింది. అందులో ఉన్న శాస్త్రీయ ఫిల్టర్లను ఉపయోగించి సూట్‌ వీటిని తన కెమెరాల్లో బంధించింది. ఈ ఫుల్‌-డిస్క్‌ చిత్రాల ద్వారా సూర్యుడి ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌లకు సంబంధించి క్లిష్టమైన వివరాలను తెలుసుకోవచ్చు. అయస్కాంత క్షేత్రం గురించి తెలుసుకోవడంలో ఈ చిత్రాలు కీలక సమాచారాన్ని అందిస్తాయని ఇస్రో వెల్లడించింది.

ఇదిలాఉంటే, సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య - ఎల్‌ 1’ తన ప్రయాణంలో చివరి దశను చేరుకుంది. ఈ ఉపగ్రహాన్ని ఎల్‌1 పాయింట్‌ (L1 Point)లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నాటికి పూర్తవుతాయని ఇటీవల ఇస్రో వెల్లడించింది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్‌ పాయింట్‌-1 చేరాక.. దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య - ఎల్‌ 1 సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. ఇందులో ఉన్న ఏడు పేలోడ్‌లలో సూట్‌ (SUIT) కూడా ఒకటి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని