India - Pakistan: పాకిస్థాన్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే!

India - Pakistan: 45 ఏళ్లుగా ఎదురుచూస్తున్న డ్యామ్‌ నిర్మాణం ఎట్టకేలకు పూర్తవడంతో పాకిస్థాన్‌కు రావి నది జలాలను భారత్‌ పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. 

Updated : 26 Feb 2024 18:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సింధూ నది (Indus River) ఉపనది రావి (Ravi River) జలాలన్నీ ఇక మనకే దక్కనున్నాయి. నాలుగున్నర దశాబ్దాల ఎదురుచూపులు ఫలించి ఈ నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తవడంతో పాకిస్థాన్‌ (Pakistan)కు నీటి ప్రవాహన్ని భారత్‌ (India) పూర్తిగా నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో ఇరు దేశాల మధ్య జరిగిన సింధూ జలాల ఒప్పందం (Indus Water Treaty) ప్రకారం.. రావి నదీ జలాలపై పూర్తి హక్కులు భారత్‌కు లభించాయి. దీంతో ఈ నది నుంచి పాకిస్థాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసేందుకు ఆనకట్టలు నిర్మించాలని భారత్‌ నిర్ణయించింది. ఇందుకోసం 1979లో పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది.

రావి నదిపై ఎగువవైపు రంజిత్‌ సాగర్‌ డ్యామ్‌, కిందివైపు షాపుర్‌ కంది బ్యారేజ్‌ను నిర్మించేందుకు అప్పటి జమ్మూకశ్మీర్ సీఎం షేక్‌ మహమ్మద్‌ అబ్దుల్లా, పంజాబ్‌ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ సంతకాలు చేశారు. 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1998 నాటికి ఇది పూర్తవ్వాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమైంది.

ఎట్టకేలకు అడ్డంకులు దాటుకుని..

2001లో రంజిత్‌ సాగర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తవ్వగా.. షాపుర్‌ కంది బ్యారేజ్‌ ఆగిపోయింది. దీంతో పాకిస్థాన్‌కు నీటి ప్రవాహం కొనసాగింది. 2008లో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. 2013లో నిర్మాణం ప్రారంభించారు. కానీ, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ మధ్య విభేదాలతో సంవత్సరానికే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. చివరకు 2018లో కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం జరపడంతో నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయి. ఎట్టకేలకు ఈ నిర్మాణం పూర్తవ్వడంతో ఆదివారం (ఫిబ్రవరి 25) నుంచి పాక్‌కు నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఇన్నాళ్లపాటు పాక్‌కు వెళ్లిన ఆ నీటిని ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లించనున్నారు. దీని వల్ల 32 వేల హెక్టార్లలో సాగుకు ఈ నీరు అందనుంది. అంతేగాక, ఈ డ్యామ్‌ నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తులో 20 శాతాన్ని జమ్మూకశ్మీర్‌కు ఇవ్వనున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకూ రావి జలాలు ఉపయోగపడనున్నాయి.

1960లో భారత్‌, పాక్‌ మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సింధు, జీలం, చీనాబ్‌ నదులు పాక్‌కు దక్కగా, రావి, బియాస్‌, సట్లెజ్‌ నదులు భారత్‌కు చెందాయి. అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, పాక్‌ అధ్యక్షుడు అయూబ్‌ ఖాన్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని