Mumtaz Patel: గుజరాత్‌లో సీట్ల సర్దుబాటు.. అహ్మద్‌ పటేల్‌ కుమార్తె క్షమాపణలు

సీట్ల సర్దుబాటులో భాగంగా గుజరాత్‌లోని భరూచ్‌ ఎంపీ స్థానాన్ని ఆప్‌కు వదిలేస్తూ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకోవడంపై ఆ పార్టీ దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ కుమార్తె ముంతాజ్‌ పటేల్‌ అసహనం వ్యక్తంచేశారు. 

Published : 24 Feb 2024 19:16 IST

అహ్మదాబాద్‌: సార్వత్రిక ఎన్నికల సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ (Congress), ఆప్‌ (AAP) పొత్తు కుదుర్చుకున్నాయి. దీనిపై ఇరు పార్టీలు అధికార ప్రకటన చేశాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌ సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ కుమార్తె ముంతాజ్‌ పటేల్‌ (Mumtaz Patel) స్పందించారు. భరూచ్‌లో ఆప్‌ పోటీ చేయడంపై ఆమె అసహనం వ్యక్తంచేశారు. 

‘‘ఆప్‌తో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్‌ భరూచ్‌ లోక్‌సభ స్థానాన్ని వదులుకోవడంపై జిల్లా కేడర్‌ను క్షమాపణలు కోరుతున్నా. అహ్మద్‌ పటేల్‌ 45 ఏళ్ల వారసత్వాన్ని మేం వృథా కానివ్వం. కలిసికట్టుగా హస్తం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం’’ అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా అసంతృప్తి వ్యక్తంచేశారు. 

‘మీ ఇంట్లో గొడవైతే.. నన్ను అనొద్దు’.. మహిళలతో ప్రధాని సరదా సంభాషణ

భరూచ్‌లో గత ఏడేళ్లుగా భాజపా గెలుస్తూ వచ్చింది. దీంతో ఈ స్థానంలో కషాయ పార్టీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు అహ్మద్‌ పటేల్‌ సంతానం ఫైసల్‌ పటేల్‌ లేదా ముంతాజ్‌ పటేల్‌ను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్‌ యోచిస్తోందంటూ ఇటీవల ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఈ సీటును ఆప్‌కు కేటాయించడంపై ఆమె తీవ్ర నిరాశ వ్యక్తంచేశారు. కాగా.. రానున్న లోక్‌సభ ఎన్నికల నిమిత్తం ఆప్‌, కాంగ్రెస్‌లు సీట్ల సర్దుబాటుపై కొలిక్కివచ్చిన సంగతి తెలిసిందే.

26 ఎంపీ స్థానాలున్న గుజరాత్‌లో 24 చోట్ల హస్తం పార్టీ పోటీ చేయనుండగా.. భరూచ్‌, భావ్‌నగర్‌లో ఆప్‌ బరిలోకి దిగనుంది. దిల్లీలోని ఏడు ఎంపీ స్థానాల్లో నాలుగుచోట్ల ఆప్‌, మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనున్నాయి. ఇక గోవా, చండీగఢ్‌లో ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని