Aiswarya S Menon: మోదీ ప్రమాణ స్వీకారానికి.. వందేభారత్‌ మహిళా లోకోపైలట్‌

ఆదివారం సాయంత్రం మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో 8,000లకు పైగా ప్రత్యేక అతిథులు హాజరవ్వనున్నారు. వారిలో దేశాభివృద్ధిలో పాలు పంచుకున్న పలువురిని ఆహ్వానించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.

Published : 08 Jun 2024 13:23 IST

దిల్లీ: మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ(PM Modi) ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, దాదాపు 8,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వారిలో ఒకరిగా దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్(loco pilot) ఐశ్వర్య ఎస్.మీనన్(Aiswarya s menon)చోటు సంపాదించుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని పొందారు. ప్రస్తుతం వందేభారత్ రైళ్లలో విధులు నిర్వర్తిస్తున్న ఐశ్వర్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్, జనశతాబ్ది వంటి వివిధ రైళ్లకు లోకో పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో చెన్నై-విజయవాడ, చెన్నై-కోయంబత్తూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో పనిచేసిన ఆమె రైల్వే సిగ్నలింగ్‌లో సమగ్ర పరిజ్ఞానాన్ని సంపాదించారు. నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ అధికారుల ప్రశంసలు అందుకున్నారు. 

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆసియా తొలి మహిళా లోకోపైలట్ సురేఖ యాదవ్(Surekha yadav) కూడా హాజరుకానున్నారు. ఆమె 1988లో భారతదేశపు మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్‌గా పేరు పొందారు.  సెమీ-హై స్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కి మొదటి మహిళా లోకో పైలట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం సురేఖ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్-సోలాపూర్ వందే భారత్ రైలును నడుపుతున్నారు. ఈ వేడుకకు మొత్తంగా 10మంది లోకో పైలట్లు ఆహ్వానం అందుకున్నారని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో పనిచేసిన శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. 

ఆదివారం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ఎన్డీఏ కూటమిని ఆహ్వానించారు. మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి 7:15 గంటలకు ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రిమండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి తమకు ఆహ్వానం అందినట్లుగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్,  భూటాన్ కౌంటర్ షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌, ఇతర విదేశీ నేతలు పేర్కొన్నారు. 

2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినందున సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. 2019లో 352 పార్లమెంటరీ నియోజకవర్గాలను గెలుచుకున్న ఎన్డీఏ ఈసారి 293 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే మెజారిటీ మార్క్ 272 కంటే ఎక్కువగా ఉంది. దీంతో  ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు భాజపా తమ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. వీటిలో 16 లోక్‌సభ స్థానాలతో చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ, 12 స్థానాలతో నీతీష్‌కుమార్‌ జనతాదళ్ యునైటెడ్ రెండు అతిపెద్ద భాజపా భాగస్వాములుగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని