Akhilesh Yadav: ‘పీడీఏ’నే ప్రధాన అస్త్రంగా.. భాజపాపై అఖిలేశ్‌ పిడుగులా..!

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ సత్తా చాటింది. దీని వెనుక పార్టీ అధినేత అఖిలేశ్‌ పాత్ర సుస్పష్టం.

Published : 05 Jun 2024 00:14 IST

లఖ్‌నవూ: గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు పెద్ద సంఖ్యలో ఎంపీలను అందించిన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈసారి ఆ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. 2019 ఎన్నికల్లో సొంతంగా 62 సీట్లు గెలుపొందిన కాషాయ పార్టీ.. ఈసారి వాటిలో ఏకంగా 29 స్థానాల్లో వెనుకంజలో ఉండటం గమనార్హం. ప్రధానంగా యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ.. కమలదళం సీట్లకు భారీగా గండికొట్టినట్లు తెలుస్తోంది. 2019లో ఒక్కసీటుకే పరిమితమైన కాంగ్రెస్‌ సైతం ఈసారి 6 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్థానికంగా ఎంపీగా ఉండటం, అధికార రాష్ట్రం కావడంతో.. యూపీని క్లీన్ స్వీప్ చేస్తామని ప్రకటించిన కమలదళానికి ఈ లెక్కలు మింగుడుపడని వ్యవహారంగా మారినట్లు తెలుస్తోంది.

2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 5 చొప్పున విజయాలకే పరిమితమైన ఎస్పీ.. ఈసారి ఏకంగా దాదాపు 37 సీట్లకు ఎగబాకడం వెనుక అఖిలేశ్‌ పాత్ర సుస్పష్టం. మొత్తం 80 స్థానాల్లో కాంగ్రెస్‌కు 18 సీట్లు, టీఎంసీకి ఒక స్థానాన్ని కేటాయించి, మిగిలిన చోట్ల తన అభ్యర్థులను నిలబెట్టారు. తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ మరణానంతరం జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఈ క్రమంలోనే ఎస్పీ చరిత్రలోనే తొలిసారి అత్యధిక ఎంపీ సీట్లు సాధించారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, అఖిలేశ్‌లను ఉద్దేశించి ప్రధాని మోదీ ‘‘దో లడ్కోకీ జోడీ (ఇద్దరు యువకుల జోడీ), దో శహజాదే (ఇద్దరు యువరాజులు)’’గా పదేపదే ఎద్దేవా చేసినప్పటికీ.. వారిద్దరూ సత్తా చాటారు.

మోదీ, అమిత్‌ షాలను ప్రజలు తిరస్కరించారు: రాహుల్ గాంధీ

‘‘2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘పిచ్‌డే (వెనుకబడిన వర్గాలు), దళితులు, అల్పసంఖ్యాక వర్గాల(PDA)’దే హవా అంటూ అఖిలేశ్‌ ప్రచార పర్వంలో దూకారు. ఓ వర్గం ఓట్లనూ గణనీయంగా రాబట్టినట్లు సమాచారం. ప్రతిపక్షాలపై అణచివేతకు పాల్పడుతోందంటూ భాజపాపై విరుచుకుపడ్డారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌లను జైల్లో పెట్టడాన్ని ఖండించారు. వారసత్వ, కుటుంబ రాజకీయాల ఆరోపణలను తిప్పికొట్టారు. ఎన్నికలకు ముందు విబేధాలను పక్కనపెట్టి బాబాయి శివ్‌పాల్‌ సింగ్‌ యాదవ్‌తో సయోధ్య కుదుర్చుకున్నారు. పార్టీ సాంప్రదాయ ఓటర్లను కాపాడుకోవడంలో ఇది సాయపడింది. 2019లో బీఎస్పీతో కలిసి పోటీ చేసినప్పటికీ.. ఈసారి దూరంగా ఉన్నారు. అయితే, ఎన్నికల ఫలితాలపై దీని ప్రభావం ఏ మాత్రం లేనట్లు కనిపిస్తోంది. ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ ఒక్కసీటూ గెలవలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని