Encounter: అది నకిలీ ఎన్‌కౌంటరే.. యోగిపై అఖిలేశ్‌ విమర్శలు

Atiq Ahmed Son Encounter: ఉత్తరప్రదేశ్‌ (UP)లో ఉమేశ్‌ పాల్ హత్య కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed) కుమారుడిని పోలీసులు నేడు ఎన్‌కౌంటర్‌ చేశారు.

Updated : 13 Apr 2023 16:59 IST

లఖ్‌నవూ: గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed) కుమారుడు అసద్‌ను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు (UP Police) ఎన్‌కౌంటర్‌ చేయడం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఇటీవల దారుణ హత్యకు గురైన ఉమేశ్‌పాల్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్‌, మరో నిందితుడిని యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చివేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) స్పందించారు. ఇది బూటకపు ఎన్‌కౌంటరే (Encounter) అంటూ యోగి సర్కారుపై విమర్శలు గుప్పించారు.

‘‘ఇలాంటి నకిలీ ఎన్‌కౌంటర్లతో అసలు సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. న్యాయ వ్యవస్థపై ఆ పార్టీకి విశ్వాసం లేదు. నేటి ఎన్‌కౌంటర్‌తో పాటు ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌ ఘటనలపై సమగ్రంగా దర్యాప్తు జరిపించాలి. అసలు నేరస్థులను వదిలిపెట్టకూడదు. ఏది కరెక్టో ఏది తప్పో నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి లేదు’’ అని అఖిలేశ్ (Akhilesh Yadav) దుయ్యబట్టారు.

2005 నాటి బీఎస్పీ (BSP) శాసనసభ్యుడు రాజుపాల్‌ (Raju Pal) హత్యకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ ఫిబ్రవరి 24న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్‌ అహ్మద్‌ హత్య తర్వాత నుంచి పరారీలో ఉన్నాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న యూపీ పోలీసులు అతడి కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా గాలించారు. చివరకు ఝాన్సీలో అతడు, మరో నిందితుడితో కలిసి బైక్‌పై పారిపోతుండగా ఎన్‌కౌంటర్‌ చేశారు. కాగా.. ఉమేశ్ పాల్ హత్య కేసులో విచారణ నిమిత్తం అతీక్‌ అహ్మద్‌ను నేడు ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో హాజరుపర్చారు. అదే సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని