Akshay Kumar: అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్‌ తొలి ఓటు

సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటేశారు. మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.

Published : 20 May 2024 13:14 IST

ముంబయి: తన భారత పౌరసత్వాన్ని తిరిగి పొందిన తర్వాత ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) తొలిసారి ఓటేశారు. ముంబయిలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్‌లో నిల్చొని తన హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా దేశం అభివృద్ధి దిశగా తన ప్రయాణం కొనసాగించాలని, బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. అది మనసులో పెట్టుకొనే ఓటేశాను. దేశ ప్రజలు వారికి ఏది సరైందని భావిస్తే.. దానికే ఓటేయాలి. పోలింగ్ శాతం బాగుంటుందని అనుకుంటున్నాను’’ అని మీడియాతో మాట్లాడారు. పౌరసత్వం తర్వాత తొలిసారి ఓటువేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.

2023లో అక్షయ్‌కు భారత పౌరసత్వం వచ్చింది. అంతకుముందు వరకు ఆయనకు కెనడా సిటిజెన్‌షిప్ ఉంది. దానిపై గతంలో మాట్లాడుతూ.. ‘‘1990ల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. వరుసగా 15 సినిమాలు పరాజయం పాలయ్యాయి. కెనడాలో ఉన్న స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసమే పాస్‌పోర్ట్‌కు అప్లయ్‌ చేశా. అప్పుడే కెనడా పాస్‌పోర్ట్‌ వచ్చింది. అంతలోనే అప్పటికే నటించిన రెండు సినిమాలు భారత్‌లో ఘన విజయం సాధించడంతో అక్కడికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఈ క్రమంలోనే పాస్‌పోర్ట్‌ విషయం మరిచిపోయా’’ అని అన్నారు.

2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని అక్షయ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే భారతీయులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునివ్వడం విమర్శలకు దారితీసింది. భారత్‌లో ఓటు హక్కు లేని వ్యక్తి సూచనలు చేయడం ఏంటని పలువురు ప్రశ్నించారు. దానిపై అక్షయ్ వివరణ ఇస్తూ.. భారత్‌ పౌరసత్వాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నానని, పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని