Lok Sabha Elections: ఈవీఎంలపై ఫిర్యాదులు.. కోర్టులు 40 సార్లు కొట్టివేశాయ్‌ : సీఈసీ

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్ల (EVMs) పనితీరుపై ఆరోపణలకు సంబంధించి దాదాపు 40కుపైగా ఫిర్యాదులపై కోర్టులు విచారణ జరిపాయని.. ప్రతిసారీ అవన్నీ తిరస్కరణకు గురయ్యాయని తెలిపింది.

Published : 16 Mar 2024 18:50 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) వేళ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల (EVMs) పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈతరహా కేసులపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పందించింది. ఇలా వచ్చిన ఫిర్యాదులను కోర్టులు 40సార్లు విచారణ జరిపాయని.. ప్రతిసారీ ఆ ఆరోపణలన్నీ తిరస్కరణకు గురయ్యాయని తెలిపింది. ఎన్నికల ప్రక్రియను ఈవీఎంలు నిష్పక్షపాతం, సరళతరం చేశాయనే విషయం అన్ని పార్టీలకూ తెలుసునని పేర్కొంది. అవే ఈవీఎంలతో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఓటమి చెందాయని గుర్తుచేసింది.

కమిషనర్‌ రాజీనామాపై..

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు కొన్ని రోజుల ముందు ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ రాజీనామా చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ స్పందించారు. అరుణ్‌ గోయెల్‌ ఎన్నికల సంఘం బృందంలో విశిష్ఠ సభ్యుడని.. ఆయనకు ఏమైనా వ్యక్తిగత కారణాలు ఉంటే వాటిని గౌరవించాలన్నారు. ఎన్నికల సంఘంలో అసమ్మతి ఎప్పుడూ ఉంటుందన్నారు.

సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024)లతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలివిడత పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని