Gyanvapi mosque: జ్ఞానవాపి మసీదులో సర్వే కొనసాగించండి: పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే కొనసాగించేందుకు అలహాబాద్‌ హైకోర్టు అనుమతించింది. తక్షణమే సర్వేను ప్రారంభించొచ్చని తెలిపింది.

Updated : 03 Aug 2023 10:47 IST

అలహాబాద్‌: కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque)లో శాస్త్రీయ సర్వే వ్యవహారంపై అలహాబాద్‌ హైకోర్టు (Allahabad High Court) కీలక ఉత్తర్వులు వెలువరించింది. మసీదు ఆవరణలో సర్వే కొనసాగించేందుకు భారత పురావస్తు శాఖకు అనుమతినిచ్చింది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. న్యాయ ప్రయోజనాల కోసం శాస్త్రీయ సర్వే చేపట్టడం అవసరమని తీర్పు వెలువరిస్తూ కోర్టు వ్యాఖ్యానించింది.

జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి జిల్లా (Varanasi Court) కోర్టు జులై 21న తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జులై 24న సర్వే ప్రారంభించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై మసీదు కమిటీ అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది.

జ్ఞానవాపి మసీదులోని హిందూ దేవతల చిహ్నాలను సంరక్షించండి

ఈ నేపథ్యంలోనే వారణాసి కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఏఎస్‌ఐ సర్వేపై స్టే విధించి తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. తక్షణమే సర్వే ప్రారంభించేందుకు ఏఎస్‌ఐకి అనుమతినిచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నేటి నుంచి మళ్లీ మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐ బృందం సర్వేను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

మొగల్‌ కాలంలో హిందూ ఆలయ స్థానంలో ఈ మసీదు నిర్మించారని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్‌ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా కార్బన్‌ డేటింగ్‌, ఇతర పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని(ASI) ఆదేశించింది. ఇప్పుడు ఈ ఉత్తర్వులను హైకోర్టు కూడా సమర్థించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని