INDIA: విపక్ష సభ్యుల సస్పెన్షన్‌.. మిగిలింది 43 మందే!

ఉభయ సభల్లో కలిపి మొత్తం 141 మంది సస్పెన్షన్‌కు గురికాగా.. వీరిలో 95 మంది లోక్‌సభ సభ్యులు, 46 మంది రాజ్యసభకు సభ్యులున్నారు. తాజా చర్యలతో ప్రస్తుత సెషన్‌లో లోక్‌సభలో (Lok Sabha) విపక్షాల సంఖ్య భారీగా తగ్గిపోయింది.

Published : 19 Dec 2023 20:33 IST

దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో (Parliament) సభ్యుల సస్పెన్షన్‌ల పర్వం కొనసాగుతోంది. ఉభయ సభల్లో కలిపి మొత్తం 141 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరిలో 95 మంది లోక్‌సభ సభ్యులు, 46 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఈ చర్యలతో ప్రస్తుత సెషన్‌లో లోక్‌సభలో (Lok Sabha) విపక్షాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ముఖ్యంగా విపక్షాల కూటమి ఇండియా (INDIA)లో మూడింట రెండొంతుల బలం తగ్గిపోయినట్లయ్యింది. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో సహా కేవలం తొమ్మిది మంది మాత్రమే కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభలో (Winter session) మిగిలిపోయారు. భారత పార్లమెంటు చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడటం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు.

లోక్‌సభలో 95 మంది..

సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంగా శీతాకాల సమావేశాలు ముగిసే వరకు పలువురు విపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ వెల్లడించారు. ఈ క్రమంలో డిసెంబర్‌ 14న 13 మంది, 18న 33 మంది, 19న మరో 45 మందిపై వేటు వేశారు. దీంతో మొత్తంగా సస్పెన్షన్‌కు గురైన లోక్‌సభ సభ్యుల సంఖ్య 95కు చేరింది. అటు రాజ్యసభలోనూ ఒక్కరోజే 45 మందిపై చర్యలు తీసుకున్నారు.

కూటమిలో అధికం..

ఇండియా కూటమికి లోక్‌సభలో 138 సభ్యుల బలం ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 43కి తగ్గిపోయింది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు 22 మంది ఎంపీలు ఉండగా.. అందులో 13 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. డీఎంకేకు 24 మంది ఉండగా, 16 మంది సభ్యులపై వేటు పడింది. ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న ఒకే ఒక్క ఎంపీ సుశీల్‌ కుమార్‌ రింకూ కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఎన్‌సీపీకి నలుగురు ఎంపీలు ఉండగా.. అందులో శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన సుప్రియా సూలేతో సహా ముగ్గురిపై వేటు పడింది.

ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌కు చెందిన ముగ్గురు, వీసీకే, ఆర్‌ఎస్‌పీకి చెందిన ఒక్కో ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇద్దరు (మొత్తం ముగ్గురు), సీపీఎం నుంచి ఇద్దరు (మొత్తం ముగ్గురు సభ్యులు), సీపీఐకి ఇద్దరు సభ్యులుండగా అందులో ఒకరిపై వేటు పడింది. బీఎస్పీకి చెందిన డానిష్‌ ఆలీ ఇటీవల సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే, బీఎస్పీ మాత్రం ఇండియా కూటమిలో లేదు. మరోవైపు ఇండియా కూటమిలో ఉన్న శివసేన (యూబీటీ)కు ఆరుగురు ఎంపీలుండగా.. ఇందులో ఎవ్వరూ సస్పెన్షన్‌కు గురికాలేదు.

రాజ్యసభలోనూ..

రాజ్యసభలోనూ సభ్యులపై చర్యలు కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ 14న ఒకరిపై వేటు పడగా.. సోమవారం (18వ తేదీన) ఒకేసారి 45 మందిపై సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. 45 మందిలో 34 మందిని శీతాకాల సమావేశాల వరకు ఈ చర్యలుంటాయని పేర్కొనగా.. మరో 11మంది ‘ప్రవర్తన’పై ప్రివిలేజెస్‌ కమిటీకి సిఫార్సు చేశారు. ఆ నివేదికను మూడు నెలల్లో అందజేయాలని సూచించారు. అప్పటివరకు వీరిపై సస్పెన్షన్‌ అమల్లో ఉండనుంది. వీరిలో సగం మంది ఇండియా కూటమికి చెందిన వారే కావడం గమనార్హం.

ఇదిలాఉంటే, లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య 543కాగా ప్రస్తుతం 522 మంది ఎంపీలున్నారు. మరో 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం సభ్యుల్లో 290 మంది భాజపా సభ్యులే. భాజపా మిత్రపక్షాలు కలిపి ఈ సంఖ్య 300 దాటుతుంది. మరోవైపు వేటు పడిన విపక్ష సభ్యుల సంఖ్య 95గా ఉంది. దీంతో దాదాపు 100 మందికిపైగా మాత్రమే ప్రతిపక్ష ఎంపీలు సభలో కొనసాగుతున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 22తో ముగియనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని