Ambedkar House: ‘రాజ్‌గృహ’ను వారసత్వ సంపదగా పరిరక్షిస్తాం.. సీఎం శిందే

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌(Dr B R Ambedkar)కు చెందిన ముంబయిలోని నివాసం ‘రాజ్‌గృహ’ను మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే సందర్శించారు.

Published : 17 Nov 2022 01:06 IST

ముంబయి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌(Dr B R Ambedkar)కు చెందిన ముంబయిలోని నివాసం ‘రాజ్‌గృహ’ను మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే సందర్శించారు. ఆ మహనీయుడు నివసించిన ఈ ఇంటిని వారసత్వ సంపదగా పరిరక్షించనున్నట్టు తెలిపారు. బుధవారం సెంట్రల్‌ ముంబయిలోని దాదర్‌ ఏరియాలో రాజ్‌గృహను సందర్శించిన ఆయన దివంగత నేత అంబేడ్కర్‌, ఆయన సతీమణి రమాబాయి అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మూడంతస్తుల భవనంలో మ్యూజియం ఉండగా.. దాంట్లోని మొదటి అంతస్తులో స్టడీ రూమ్‌ ఉంది. ఈ సందర్భంగా ఆ భవనంలోని రెండు, మూడో అంతస్తులో నివాసం ఉంటున్న అంబేడ్కర్‌ కుటుంబ సభ్యులను శిందే కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ దేశానికే గర్వకారణమన్నారు. ఆయన నివసించిన ఈ ఇల్లు చారిత్రక సంపద అని.. దీన్ని వారసత్వ సంపదగా పరిరక్షించనున్నట్టు తెలిపారు. మరోవైపు, సీఎం ఏక్‌నాథ్‌ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌లు ఇందు మిల్స్‌ కాంపౌండ్‌ను సందర్శించి అక్కడ అంబేడ్కర్‌ అంతర్జాతీయ స్మారక చిహ్నం నిర్మాణ పనులను సమీక్షించినట్టు అధికారులు వెల్లడించారు.

డా. బాబాసాహెబ్ నివాసంతో పాటు, వస్తు మ్యూజియంలో అనేక రోజువారీ వినియోగ వస్తువులు, ఆయన అధ్యయన గది, రాసిన పుస్తకాల సేకరణ, ఆయన వాడిన కలం తదితర అమూల్యమైన వస్తువుల్ని చూసే అవకాశం తనకు లభించిందని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని