Atishi: హరియాణా దిల్లీకి నీటి విడుదలను తగ్గించింది: ఆప్ నేత ఆతిశీ

సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించకుండా హరియాణా ప్రభుత్వం దిల్లీకి నీటి సరఫరాను అడ్డుకొంటోందని ఆప్‌ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు.   

Published : 07 Jun 2024 15:00 IST

దిల్లీ: దిల్లీ ప్రజలపై హరియాణా(Haryana) ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమ్‌ఆద్మీ పార్టీ(APP) నేత ఆతిశీ(Atishi) ఆరోపించింది. ఇందులోభాగంగానే గత మూడు రోజులుగా దేశ రాజధానికి నీటి విడుదలను తగ్గించిందని పేర్కొన్నారు. దిల్లీకి 137 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించిన ఒకరోజు అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రం నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో నీటి విషయంలో రాజకీయాలు చేయకూడదని, దేశ రాజధానికి మిగులు జలాలను సరఫరా చేయాలని తాజాగా సుప్రీంకోర్టు హరియాణాను ఆదేశించింది.

కాగా శుక్రవారం ఆతిశీ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ‘‘హరియాణా కుట్ర బట్టబయలు అయ్యింది. సుప్రీంకోర్టు దిల్లీ నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే హరియాణా మాత్రం రాష్ట్ర ప్రజలపై కుట్ర చేస్తోంది. అత్యున్నత న్యాయస్థానంలో కేసు విచారణలో ఉండగా, దిల్లీకి విడుదల చేస్తున్న నీటిని పొరుగు రాష్ట్రం గత మూడు రోజుల నుంచి క్రమంగా తగ్గిస్తోంది’’ అని పోస్ట్‌ చేశారు.

శుక్రవారం ఉదయం 11 గంటలకు మంత్రి వజీరాబాద్ (Wazirabad) బ్యారేజీని సందర్శించి నీటి పరిస్థితిని అంచనా వేయనున్నారు. హీట్‌వేవ్ కారణంగా నీటి డిమాండ్ పెరిగిందని, యమునలో నీటిమట్టం తగ్గడంతో ఉత్పత్తి తక్కువగా ఉంటుందని ఆమె ఇటీవల చెప్పారు. ‘‘గతేడాది వజీరాబాద్ చెరువులో 674.5 అడుగుల మేర నీరు ఉంది... ఎన్నిసార్లు అడిగినా 671 అడుగుల నీటినే విడుదల చేశారు.. వజీరాబాద్‌ బ్యారేజీలో నీటిమట్టం తక్కువగా ఉండడంతో నీటిశుద్ధి కేంద్రాలన్నీ దెబ్బతిన్నాయి. హరియాణా, యూపీ ప్రభుత్వాలు మరింత నీరు విడుదల చేయాలని కోరాం..’’ అని ఆమె పేర్కొన్నారు.

హరియాణా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి అదనంగా నీరు అందించాలని కోరుతూ దిల్లీ ప్రభుత్వం గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హీట్‌వేవ్‌ కారణంగా కొద్దికాలంగా రాష్ట్రంలో నీటి డిమాండ్ గణనీయంగా పెరిగిందని తన పిటిషన్‌లో పేర్కొంది. హరియాణా, యూపీ, హిమాచల్‌తో సహా ఇతర రాష్ట్రాల నుంచి ఒక నెల పాటు అదనపు నీటిని విడుదల చేయాలని న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్రం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వేళ దిల్లీలో నిర్మాణ ప్రదేశాల్లో నీటి వినియోగం, వాహనాలను కడగడం వంటి వాటిపై ప్రభుత్వం నిషేధించింది. నీటిని వృథా చేసిన వారికి రూ.2,000 జరిమానా విధిస్తామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు