Amit Shah: జమ్ముకశ్మీర్‌పై అమిత్‌షా కీలక సమావేశం!

జమ్ముకశ్మీర్‌లో శాంతి భద్రతలు, జీరో టెర్రర్‌ ప్లాన్‌ తదితర అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Published : 01 Jan 2024 16:55 IST

దిల్లీ: జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir) భద్రతపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) మంగళవారం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలు, జీరో టెర్రర్‌ ప్లాన్‌ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, చీఫ్‌ సెక్రెటరీ అటల్‌ డుల్లూ, డీజీపీ స్వైన్‌ పాల్గొననున్నారు. వీరితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ తపన్‌ డేకా తదితర ఉన్నతాధికారులు హాజరుకానుండటంతో ఈ భేటీకి  ప్రాధాన్యత ఏర్పడింది.

జమ్ముకశ్మీర్‌లో 2021లో రూ.28,400 కోట్ల విలువైన పారిశ్రామిక అభివృద్ధి పనులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. వీటి పురోగతిపై అమిత్ షా చర్చించే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతేడాది జనవరి 13న అమిత్‌షా ఇదే తరహా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జీరో టెర్రర్‌ ప్లాన్‌ను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉగ్రవాదుల సమాచార వ్యవస్థను నిర్మూలించేందుకు 360 డిగ్రీల భద్రతా యంత్రాంగాన్ని పటిష్ఠం చేయనున్నట్లు అమిత్‌ షా వెల్లడించారు. సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ నుంచి ముప్పు పొంచి ఉండటంతోపాటు ఇటీవల కాలంలో ఉగ్ర కదలికలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఏయే అంశాలు చర్చకు వస్తాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని