Amritpal Singh: అమృత్‌పాల్‌ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్‌ సరిహద్దుల్లో పోస్టర్లు..

పరారీలో ఉన్న అమృత్‌పాల్‌ (Amritpal Singh) కోసం ఏడో రోజు వేట కొనసాగుతోంది. అతడు దేశం విడిచి పారిపోయే అవకాశాలున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు.. నేపాల్‌ సరిహద్దుల్లో చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు.

Updated : 24 Mar 2023 11:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) దేశం దాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 20న హరియాణాలో ఉన్న అతడు.. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ చేరుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి నేపాల్‌ (Nepal) మీదుగా కెనడా వెళ్లేందుకు అతడు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో భారత్-నేపాల్‌ సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. అతడి పోస్టర్లను అంటించారు.

అమృత్‌పాల్‌ (Amritpal Singh)ను అరెస్టు చేసేందుకు గత శనివారం పోలీసులు (Punjab Police) పక్కా వ్యూహంతో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినప్పటికీ అతడు తప్పించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారం రోజులుగా అతడి ఆచూకీ కోసం పోలీసులు అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పంజాబ్‌ నుంచి పారిపోయిన అతడు.. హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాలో ఓ మహిళ ఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడకు వెళ్లి సోద చేయగా.. అప్పటికే అతడు పారిపోయినట్లు తెలిసింది. మరోవైపు కురక్షేత్రలో ఓ వీధిలో అతడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. అందులో ముఖం కన్పించకుండా ఉండేందుకు అమృత్‌పాల్ (Amritpal Singh) గొడుగు అడ్డు పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం అతడు ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో ఉన్నట్లు తెలుస్తోంది. హరియాణాలో అతడికి ఆశ్రయమిచ్చిన బల్జీత్‌కౌర్‌ అనే మహిళను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అమృత్‌పాల్‌ ఉత్తరాఖండ్‌ వెళ్లాడని ఆమె విచారణలో వెల్లడించినట్లు పోలీసు వర్గాల సమాచారం. దీంతో ఆ రాష్ట్రానికి అలర్ట్‌ జారీ చేశారు. ఉత్తరాఖండ్‌ నుంచి అతడు నేపాల్‌ పారిపోయేందుకు యత్నించే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లో (Indo Nepal Border) చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. అతడిని పట్టుకునేందుకు సరిహద్దుల్లో పోస్టర్లు కూడా అంటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని