Amritpal Singh: అమృత్‌పాల్‌ రెండో కారు, దుస్తులు సీజ్‌.. పంజాబ్‌ దాటేసి ఉంటాడా?

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) కోసం పోలీసుల వేట నాలుగో రోజుకు చేరింది. అయితే అతడు పంజాబ్‌ దాటి పారిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 21 Mar 2023 16:34 IST

చండీగఢ్‌: పరారీలో ఉన్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అతడిని పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు (Punjab Police) వరుసగా నాలుగో రోజు ముమ్మరంగా వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిందుకు అమృత్‌పాల్‌ ఉపయోగించిన రెండో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడి దుస్తులు లభించినట్లు తెలిపారు. దీంతో అతడు పంజాబ్ (Punjab) సరిహద్దులు దాటి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

అమృత్‌పాల్‌ (Amritpal Singh) కోసం శనివారం పోలీసులు పక్కా వ్యూహంతో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినప్పటికీ అతడు తప్పించుకున్న విషయం తెలిసిందే. పోలీసులు వచ్చినట్లు సమాచారం అందగానే తాను ప్రయాణిస్తున్న మెర్సిడెస్‌ వాహనాన్ని అమృత్‌పాల్‌ అక్కడే వదిలేసి బ్రెజా కారులో వేరే మార్గంలో ఉడాయించాడు. అతడి కోసం పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తుండగా.. సోమవారం ఈ కారును గుర్తించారు. అందులో కొన్ని ఆయుధాలతో పాటు అతడి దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడు తన దుస్తులను మార్చుకుని.. తన అనుచరుడి ద్విచక్రవాహనంపై పంజాబ్‌ సరిహద్దులను దాటి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. అదే నిజమైతే, అతడు నేపాల్‌ మీదుగా కెనడా పారిపోయే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అస్సాం జైలుకు అమృత్‌పాల్‌ మామ..

అమృత్‌పాల్‌ (Amritpal Singh) పారిపోయేందుకు సహకరించిన అతడి అనుచరుల్లో 114 మందిని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే నిందితుడి మామ హర్జీత్‌ సింగ్‌ పోలీసుల ఎదుట లొంగిపోగా.. అతడిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కేసు నమోదు చేశారు. హర్జీత్‌ను అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైలుకు తరలించారు. అమృత్‌పాల్ మరో ఐదుగురు అనుచరులపైనా ఎన్‌ఎస్‌ఏ కేసులు నమోదు చేశారు.

మార్చి 23 వరకు ఇంటర్నెట్‌ ఆంక్షలు

మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పంజాబ్‌ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ ఆంక్షలను మంగళవారం కాస్త సడలించారు. కొన్న ప్రాంతాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నేడు పునరుద్ధరించారు. అయితే, తరన్‌ తరన్‌, ఫిరోజ్‌పూర్‌, మోఘా, సంగ్రూర్‌, అమృత్‌సర్‌లోని అజ్‌నాలా సబ్‌ డివిజన్‌, మొహాలీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం గురువారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్‌పై ఆంక్షలు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు