Anand Mahindra: సానియా మీర్జా నాకు స్ఫూర్తి.. ఆనంద్‌ మహీంద్రా మోటివేషనల్ పోస్ట్‌

టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) జీవితం నుంచి తాను స్ఫూర్తి పొందానని అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra). కెరీర్‌ చివర్లో ఆమెలో విజయం సాధించాలనే ఆకలి ఏ మాత్రం తగ్గలేదన్నారు.

Published : 06 Feb 2023 15:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra).. వారాన్ని ఉత్సాహంగా మొదలుపెట్టేందుకు ప్రతి సోమవారం స్ఫూర్తిదాయక సందేశాలను పంచుకుంటారు. ఈ రోజు కూడా ఆయన ఓ మండే మోటివేషన్‌ (Monday motivation) షేర్‌ చేశారు. మరి ఈరోజు ఆయన ప్రేరణ పొందింది ఎవరి నుంచో తెలుసా? మన టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా (Sania Mirza) నుంచే. సానియా కెరీర్‌ తనలో కొత్త స్ఫూర్తిని రగిలించిందని మహీంద్రా నేడు ట్వీట్‌ చేశారు.

టెన్నిస్‌ (Tennis) కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన సానియా మీర్జా గత నెల తన చివరి గ్రాండ్‌స్లామ్‌ ఆడింది. ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీలో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫైనల్‌ వరకు వెళ్లి ఓటమితో గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ముగించింది. ఆ మ్యాచ్‌కు ముందు సానియా (Sania Mirza) మాట్లాడుతూ.. ‘‘పోటీతత్వం అనేది నా రక్తంలోనే ఉంది. నేను ఎప్పుడు కోర్టులో అడుగుపెట్టినా గెలవాలనే ఆడుతా. అది నా చివరి గ్రాండ్‌స్లామ్‌ అయినా లేదా చివరి సీజన్‌ అయినా సరే..!’’ అని తెలిపింది. ఈ సందేశాన్ని ఆనంద్‌ మహీంద్రా సోమవారం తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ‘‘ఆమె(సానియా) తన కెరీర్‌ను ఎలా ప్రారంభించిందో అలాగే ముగించింది. విజయం సాధించాలనే పట్టుదల ఆమెలో ఏ మాత్రం తగ్గలేదు. నా కెరీర్‌లో ఈ దశలోనూ రాణించాలనే కోరికను నాలో సజీవంగా ఉంచుకునేలా ఆమె జీవితం గుర్తుచేసింది. ఆమే నా మండే మోటివేషన్‌’’ అని మహీంద్రా (Anand Mahindra) రాసుకొచ్చారు.

36 ఏళ్ల సానియా మీర్జా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన కెరీర్‌లో సానియా (Sania Mirza) మొత్తం 43 డబుల్స్‌ టైటిళ్లు సాధించింది. ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలున్నాయి. మహిళల డబుల్స్‌ కేటగిరీలో 91 వారాల పాటు నంబర్‌ 1 క్రీడాకారిణిగా నిలిచింది. త్వరలో జరగబోయే దుబాయి ఓపెన్‌లో సానియా తన కెరీర్‌లో చివరి టోర్నీ ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని