Anand Mahindra: ‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్‌ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్‌

Anand Mahindra - Elon Musk: తయారీ రంగంలో హీరోల జీవితాలను వెండి తెరపైకి తీసుకురావాలని ఎలాన్‌ మస్క్‌ ఇచ్చిన పిలుపును ఆనంద్‌ మహీంద్రా స్వాగతించారు.

Published : 29 Mar 2024 18:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్ఫూర్తిదాయక కథనాలతో సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra).. ఈసారి తయారీరంగంలోని హీరో (manufacturing heroes)ల గురించి స్పందించారు. వీరిని ఉద్దేశిస్తూ సినిమా రంగంపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేసిన వ్యాఖ్యలను మహీంద్రా సమర్థించారు. ఆ హీరోల జీవితాలపై సినిమాలు రావాలని అభిప్రాయపడ్డారు. ఈసందర్భంగా తన కెరీర్‌ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. అసలేం జరిగిందంటే..

తయారీ రంగంలో పనిచేసే వారిని ఉద్దేశిస్తూ ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ఓ పోస్ట్‌ చేశారు. ‘‘గ్యారేజీలో ఒంటరిగా ఉన్న ఆవిష్కర్త ఉన్నట్టుండి గొప్ప ఆలోచనలు చేయడం, చరిత్ర సృష్టించే విజయాలను సాధించడంపై అనేక సినిమాలు వచ్చాయి. కానీ, తయారీ రంగం గురించి ఒక్క చిత్రం కూడా తెరకెక్కలేదు. కాబట్టి ఈ రంగాన్ని ప్రజలు తక్కువగా అంచనా వేస్తున్నారు. ఉత్పత్తి కోసం పడే కష్టంతో పోలిస్తే ప్రొటోటైప్‌ల గురించి చెప్పడం తేలిక కదా’’ అని రాసుకొచ్చారు.

ఈ పోస్ట్‌కు ఆనంద్‌ మహీంద్రా బదులిస్తూ.. ‘‘మస్క్‌ అభిప్రాయాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. ఆటో ప్లాంట్‌లోని ఉత్పత్తి విభాగంలో నా కెరీర్‌ను ప్రారంభించా. ఎక్కువ సంఖ్యలో వస్తువులను ఉత్పత్తి చేయడం కోసం అక్కడ పనిచేసే వారి నిరంతర కృషి, సమస్య పరిష్కారంలో చూపించే నైపుణ్యాలు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటాయి. జీవిత కథలపై సినిమాలకు ఈ హీరోలు తగిన అర్హులు. మా కార్ల తయారీకి సంబంధించి మేం రూపొందించే లఘుచిత్రాలకు యూట్యూబ్‌లో విశేష ఆదరణ లభిస్తుంది. కాబట్టి ఇలాంటి రంగంలో మరిన్ని చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు’’ అని అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని