Jammu Kashmir: ఆర్టికల్‌ 370.. రద్దు నుంచి సుప్రీం తీర్పు వరకు!

‘ఆర్టికల్‌ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court)పేర్కొంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30లోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) నిర్వహించాలని ఆదేశించింది.

Published : 11 Dec 2023 14:49 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనని పేర్కొంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30లోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2019లో ఆర్టికల్‌ 370 రద్దు మొదలు.. అనంతరం పరిణామాలను ఓసారి పరిశీలిస్తే..

  • డిసెంబర్‌ 20, 2018: జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. జులై 3, 2019న దాన్ని మరోసారి పొడిగించారు.
  • ఆగస్టు 5, 2019: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
  • ఆగస్టు 6, 2019: ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఎం ఎల్‌ మిశ్రా అనే న్యాయవాది సుప్రీం కోర్టులో తొలి పిటిషన్‌ దాఖలు చేశారు. కొంతకాలానికి జమ్మూ కశ్మీర్‌కు చెందిన మరో న్యాయవాది షకీర్‌ షబీర్‌ ఆ జాబితాలో చేరారు.
  • ఆగస్టు 10, 2019: స్థానిక పౌరుల ఆమోదం లేకుండా రాష్ట్ర హోదాను మార్చారని పేర్కొంటూ జమ్మూ కశ్మీర్‌లో ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (NC) కూడా పిటిషన్‌ దాఖలు చేసింది.
  • ఆగస్టు 28, 2019: జర్నలిస్టులపై ఆంక్షలు తొలగించాలని కోరుతూ కశ్మీర్‌ టైమ్స్‌ ఎడిటర్‌ చేసిన విజ్ఞప్తిపై కేంద్రంతోపాటు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.
  • ఆగస్టు 28, 2019: ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సిఫార్సు చేసింది.
  • సెప్టెంబర్‌ 19, 2019: ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.
  • మార్చి 2, 2020: ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
  • ఏప్రిల్‌ 25, 2022: జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం జరుగుతోన్న కసరత్తుపై తక్షణమే విచారణ జరపాలని పిటిషన్‌ దాఖలైంది. ఈ క్రమంలోనే ఆర్టికల్‌ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.
  • జులై 11, 2023: ఆగస్టు 2 నుంచి రోజువారీ విచారణ ప్రారంభిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది.
  • ఆగస్టు 2, 2023: ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది.
  • సెప్టెంబర్‌ 5, 2023: దీనిపై దాఖలైన 23 పిటిషన్లపై 16 రోజులు విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. తీర్పు రిజర్వు చేసింది.
  • డిసెంబర్‌ 11, 2023: ఆర్టికల్‌ 370 రద్దును సమర్థిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని తెలిపింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని