‘కేజ్రీవాల్‌ను కరడుగట్టిన నేరస్థుడిలా చూస్తున్నారు’ - పంజాబ్‌ సీఎం ఆరోపణ

నేరస్థులకు ఇచ్చే కనీస సదుపాయాలు కూడా దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు కల్పించడం లేదని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఆరోపించారు.

Updated : 15 Apr 2024 17:07 IST

దిల్లీ: తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను కరడుగట్టిన నేరస్థుల కంటే దారుణంగా చూస్తున్నారని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఆరోపించారు. నేరస్థులకు ఇచ్చే కనీస సదుపాయాలు కూడా కేజ్రీవాల్‌కు కల్పించడం లేదన్నారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్‌తో ఆప్‌ ఎంపీ సందీప్‌పాఠక్‌తో కలిసి పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ములాఖత్‌ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అరగంట పాటు ఉన్నప్పటికీ కేవలం ఫోన్‌లోనే మాట్లాడాల్సి వచ్చిందన్నారు.

‘కేజ్రీవాల్‌ను చూడగానే భావోద్వేగానికి గురయ్యా. ఆయన్ను కరడుగట్టిన నేరస్థుడిలా చూస్తున్నారు. ఆయన చేసిన తప్పేంటి? మొహల్లా క్లినిక్‌ నిర్మించడమే ఆయన తప్పా?’ అని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ వాపోయారు. ఇండియా కూటమి తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనాలని తనకు సూచించారని, జూన్‌ 4 ఫలితాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తుందన్నారు. జైల్లో ఉన్నా కూడా దిల్లీ ప్రజల కోసమే కేజ్రీవాల్‌ ఆందోళన చెందుతున్నారని ఆప్‌ ఎంపీ సందీప్‌ పాఠక్‌ పేర్కొన్నారు. వచ్చే వారం నుంచి ఇద్దరు మంత్రులను పిలిపించి సమస్యలపై చర్చిస్తానని కేజ్రీవాల్‌ చెప్పారన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు కూడా దిల్లీ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారని అన్నారు.

ములాఖత్‌లో భాగంగా ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు అరగంట మాట్లాడుకున్నారు. గ్లాస్‌ గోడ అడ్డుగా ఉండటంతో కేవలం ఇంటర్‌కామ్‌ ద్వారా సంభాషించుకున్నట్లు తెలిసింది. జైలు నిబంధనల ప్రకారం, ఓ సాధారణ సందర్శకుడిగానే కేజ్రీవాల్‌ను పంజాబ్‌ సీఎం కలిసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. మరోవైపు భగవంత్‌ మాన్‌కు ‘జెడ్‌’ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో తిహాడ్ జైలు బయట భద్రతను కట్టుదిట్టం చేశారు. కేజ్రీవాల్‌ కుటుంబంతోపాటు పంజాబ్‌ సీఎంను జైల్లో వ్యక్తిగతంగా భేటీ కానివ్వడం లేదని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని