Arvind Kejriwal: జైలు నుంచే తొలి ఆదేశాలు జారీ చేసిన కేజ్రీవాల్‌..!

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలు నుంచి తొలి ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్‌ వర్గాలు చెబుతున్నాయి. 

Updated : 24 Mar 2024 14:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) పాలన సాగిస్తారా..? లేదా..? అనే అంశంపై గందరగోళం నెలకొన్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఆదివారం జైలు నుంచే ఆయన పాలన ప్రారంభించినట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) వర్గాలు వెల్లడించాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీ నుంచే ఆయన నేడు తొలిసారి దిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేశారు. దీనిని ఓ నోట్‌ రూపంలో జలమంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న ఆతిశీ మార్లీనాకు ఆయన పంపించారు.

ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతో మార్చి 21వ తేదీన కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. మనీలాండరింగ్‌ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. తర్వాత కోర్టు ఆయన్ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. కానీ, ఆయన ఇప్పటి వరకు సీఎం పదవికి రాజీనామాను సమర్పించలేదు. లాకప్‌ నుంచే పాలన కొనసాగిస్తారని ఆప్‌ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ‘‘మేము అంతకు ముందే చెప్పాము. కేజ్రీవాల్‌ ప్రభుత్వ పాలన కొనసాగిస్తారు. జైలు నుంచి పాలించకుండా ఏ చట్టమూ అడ్డుకోలేదు. ఆయన పై ఆరోపణలు రుజువుకాలేదు. అందుకే ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగుతారు’’ అని మంత్రి ఆతిశీ మార్లీనా వెల్లడించారు.

కేజ్రీవాల్‌ ఒకవేళ రాజీనామా ప్రకటిస్తే ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎంగా ప్రభుత్వాన్ని నడపొచ్చని సీనియర్‌ బ్యూరోక్రాట్‌, దిల్లీ మాజీ చీఫ్‌ సెక్రటరీ ఉమేశ్‌ సైగల్‌ తెలిపారు. జైలు మాన్యువల్‌ కూడా ఒక వ్యక్తి కారాగారం లోపలి నుంచి ప్రభుత్వాన్ని నడపడానికి అనుమతించదని స్పష్టం చేశారు.

ఆ లేఖ చూసి కన్నీటి పర్యంతమయ్యాను: మంత్రి ఆతిశీ

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇచ్చిన ఆదేశాలను మంత్రి ఆతిశీ మార్లీనా ధ్రువీకరించారు. ఆదివారం ఉదయం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘‘కేజ్రీవాల్‌ నాకు ఒక లేఖ, మార్గదర్శకాలను పంపించారు. వాటిని చదివే సమయంలో నా కళ్లవెంట నీళ్లొచ్చాయి. ఓ పక్క జైల్లో ఉన్నా.. దిల్లీ ప్రజల సమస్యల గురించే ఆలోచిస్తున్నారు. కేజ్రీవాల్‌కే ఇది సాధ్యం. రెండు కోట్ల మంది నగర వాసుల కుటుంబ సభ్యుడు ఆయన. భాజపా ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టగలదు.. కానీ, ప్రజలపై ఆయన ప్రేమను ఖైదు చేయలేదు’’ అని పేర్కొన్నారు. ఆయన జైల్లో ఉన్నంత మాత్రాన ఏ పనీ ఆగదు అని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని