Anna Hazare: కేజ్రీవాల్‌కు ఎన్నోసార్లు చెప్పా.. వింటేగా..!

మద్యం అంశానికి దూరంగా ఉండాలని సీఎం కేజ్రీవాల్‌కు ఎన్నోసార్లు చెప్పానని, మరింత సంపాదించాలనే ఉద్దేశంతో ప్రత్యేక మద్యం పాలసీనే తీసుకొచ్చారని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు.

Updated : 22 Mar 2024 16:44 IST

దిల్లీ: మద్యం విధానం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు (Arvind Kejriwal Arrest) కావడంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare) స్పందించారు. మద్యం అంశానికి దూరంగా ఉండాలని గతంలో పలుమార్లు హెచ్చరించానని చెప్పారు. కానీ, మరింత సంపాదించాలన్న ఉద్దేశంతో ఆయన ఏకంగా ప్రత్యేక విధానాన్నే తీసుకొచ్చారని తెలిపారు. కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ, పలు విపక్ష పార్టీలు ఆయనకు మద్దతు ప్రకటిస్తున్న తరుణంలో హజారే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

‘‘ కేజ్రీవాల్‌ గతంలో నాతో కలిసి పని చేశారు. మద్యానికి వ్యతిరేకంగా తన గళం వినిపించారు. అలాంటిది ఇవాళ మద్యం విధానాన్ని తీసుకొచ్చి చిక్కుల్లో పడ్డారు. ఆయన అరెస్టు కావడం చాలా బాధగా ఉంది. కానీ, ఇప్పుడేం చేయగలం. చట్టం ప్రకారం ఏది జరిగినా ఎదురుచెప్పలేం’’ అని హజారే పేర్కొన్నారు. 2011లో హజారే నేతృత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఈ పోరాటం నుంచే ఆమ్‌ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది. హజారే మాత్రం మొదటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. పలు అంశాల్లో బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. కానీ, ఆయనకు కేజ్రీవాల్ ఎలాంటి కౌంటర్లు ఇచ్చేవారు కాదు. 

దిల్లీ మద్యం విధానం గురించి అన్నాహజారే గతంలోనూ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ మేరకు తన బాధను వివరిస్తూ 2022లో సీఎం కేజ్రీవాల్‌కు లేఖ కూడా రాశారు. ‘‘ మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను రాస్తున్న మొదటి లేఖ ఇది. మీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం గురించి తెలిసి చాలా బాధనిపించింది. మద్యం లాగానే అధికారం కూడా మత్తునిస్తుంది. మీరు అధికారం మత్తులో ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. తాజాగా ఆ లేఖ వైరల్‌ అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని