Arvind Kejriwal: మరో వారం రోజులు బెయిల్‌ పొడిగించండి..సుప్రీంకు కేజ్రీవాల్‌ వినతి

ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి మరో ఏడు రోజులు బెయిల్‌ను పొడిగించాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంను అభ్యర్థించారు.

Published : 27 May 2024 10:35 IST

దిల్లీ: ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) సుప్రీం (Supreme court)లో పిటిషన్‌ వేశారు. ఇటీవల ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ మంజూరు చేయమని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరడంతో జూన్‌ 1వరకు సుప్రీం కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. జూన్‌ 2న  తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది.

దిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఆయనకు ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయని, మరి కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని  వైద్య బృందం తెలిపింది. సీఎం ఆరోగ్యానికి కీలకమైన వైద్య పరీక్షలు పూర్తి చేసేందుకు మరో ఏడు రోజులు బెయిల్‌ పొడిగించాలని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది సుప్రీం కోర్టును అభ్యర్థించారు.

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో కస్టడీలోకి తీసుకుంది.  తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని