Arvind Kejriwal: ‘ఈడీ ఓపికపట్టాలి’: ఏడోసారీ విచారణకు కేజ్రీవాల్‌ డుమ్మా

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఏడోసారీ ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. 

Updated : 26 Feb 2024 10:47 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విచారణకు డుమ్మా కొట్టారు. దర్యాప్తు సంస్థ సమన్ల ప్రకారం.. సోమవారం ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. తాను హాజరుకావడం లేదని సీఎం సమాచారమిచ్చారు. ఆయన ఇలా విచారణకు గైర్హాజరుకావడం ఇది ఏడోసారి. 

‘ఈ ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. మార్చి 16న విచారణ జరగనుంది’ అని ఆప్‌ వెల్లడించింది. దర్యాప్తు సంస్థ న్యాయ ప్రక్రియను గౌరవించాలని ఈ సందర్భంగా పేర్కొంది. పదేపదే సమన్లు జారీ చేయడం సరికాదని, కోర్టు ఆదేశాలు వెలువడే వరకు ఓపికతో వేచి ఉండాలని కోరింది.

మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం జారీ చేసిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ కొద్దిరోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే.. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించారు. తాజాగా ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు అందుతున్నాయి. ఇక ఇదే కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ జైల్లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని