Arvind Kejriwal: పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..

నేడు తిహాడ్‌ జైల్లో లొంగిపోనున్న సందర్భంగా దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ నాయకులను, కార్యకర్తలనుద్దేశించి ఎక్స్‌లో తన సందేశాన్ని వెలువరించారు. 

Published : 02 Jun 2024 12:41 IST

దిల్లీ: ఎన్నికల ప్రచారానికి సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ముగియడంతో నేడు(ఆదివారం) తిహాడ్‌ జైల్లో లొంగిపోతానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తెలిపారు. లొంగిపోయే ముందు రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని, కన్నాట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తానని తెలిపారు.

ఈ విషయంపై ఆదివారం ఉదయం కేజ్రీవాల్‌ ఎక్స్‌ వేదికగా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సందేశం ఇచ్చారు. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సర్వోన్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు. ఈరోజు తిరిగి లొంగిపోతాను. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరి రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తాను, అక్కడ నుంచి హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమంతుని ఆశీర్వాదం తీసుకుంటాను. అనంతరం పార్టీ ఆఫీస్‌కి వెళ్లి నేతలను, కార్యకర్తలను కలిసి అటు నుంచి తిహాడ్‌కు వెళ్తాను. మీరు ఇక్కడ సంతోషంగా ఉంటేనే మీ ముఖ్యమంత్రి జైల్లో సంతోషంగా ఉండగలుగుతాడు’’ అంటూ రాసుకొచ్చారు.

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై మే 10న జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆయనకు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ జూన్ 2న తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ దిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై శనివారం కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో కేజ్రీవాల్‌కు బెయిల్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఆయన వాస్తవాలను తొక్కిపట్టి, తన ఆరోగ్యంతో సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వాలని సీఎం తరఫు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును జూన్‌ 5కు వాయిదా వేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు