Ashwini Vaishnaw: బుల్లెట్‌ రైలు.. మరో కీలక అప్‌డేట్‌ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్‌

బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ షేర్‌ చేశారు.

Updated : 30 Mar 2024 14:35 IST

దిల్లీ: భారత్‌లో బుల్లెట్‌ రైలు (Bullet Train) ప్రాజెక్ట్‌ నిర్మాణంలో పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ‘ఎక్స్‌’ ద్వారా షేర్ చేస్తున్నారు. స్టేషన్‌, ట్రాక్‌ నిర్మాణం ఎలా సాగుతోంది? తదితర అప్‌డేట్‌లను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. తాజాగా మరో ముఖ్యమైన వీడియోను ఆయన షేర్‌ చేశారు.  బుల్లెట్‌ రైలు కోసం భారత్‌లోనే తొలి ‘జే-స్లాబ్‌ బాలాస్ట్‌లెస్‌ ట్రాక్‌ సిస్టమ్‌’ (J-Slab Ballastless Track System)ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో నాలుగు భాగాలుంటాయి. అవి 300 ఎం.ఎం. మందం, 2420 ఎం.ఎం. వెడల్పుతో ఆర్‌సీ ట్రాక్‌ బెడ్‌, సిమెంట్‌ అస్పాల్ట్‌ మోర్టార్‌, ప్రీకాస్ట్‌ ట్రాక్‌ స్లాబ్‌, రైలు వేగానికి సంబంధించిన పరికరాలు. ఇవి రైలు 320 కి.మీ వేగంతో ప్రయాణించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా ఆర్‌టీ ట్రాక్‌ స్లాబ్‌లను గుజరాత్‌లో రెండు ప్రాంతాల్లో తయారుచేస్తున్నారు. వాటినే ట్రాక్‌ నిర్మాణంలో ఉపయోగించనున్నారు. 

‘‘బుల్లెట్‌ రైలు కోసం భారత్‌లోనే మొదటి బాలాస్ట్‌లెస్‌ ట్రాక్‌. 320 కి.మీ వేగంతో ప్రయాణం. 153 కి.మీ వయాడక్ట్‌ నిర్మాణం పూర్తైంది. 295.5 కి.మీ పియర్‌ వర్క్‌ పూర్తైంది. మోదీ 3.0లో మరిన్ని రాబోతున్నాయి’’ అని ట్వీట్‌ చేశారు. అహ్మదాబాద్‌-ముంబయి మధ్య నిర్మిస్తున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో కొంతభాగం ఆగస్టు 2026 నాటికి పూర్తవుతుందని ఇప్పటికే వెల్లడించారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి కేవలం 2.58 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్‌ హబ్‌లో తొలి బుల్లెట్‌ రైలు స్టేషన్‌ను నిర్మించారు. మరోవైపు ముంబయిలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ స్టేషన్‌ సివిల్‌ వర్క్స్‌ దాదాపు 15శాతం పూర్తయ్యాయని నేషనల్‌ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NHSRCL) వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని