Atiq Ahmed: ‘నా బిడ్డ చావుకు నేనే కారణం’: కన్నీరుపెట్టుకున్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌

గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed) కుమారుడు అసద్‌ను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. దీనిపై ఉమేశ్‌పాల్ కుటుంబం యూపీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపింది.

Published : 13 Apr 2023 19:33 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్ సంచలనం సృష్టించింది. ఉమేశ్‌ పాల్‌ (Umesh Pal) హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed) కుమారుడు అసద్‌.. స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. కుమారుడి మరణవార్త విన్న అతీక్‌ కుప్పకూలాడు. ఉమేశ్ పాల్ హత్య కేసులో విచారణ నిమిత్తం అతీక్‌ అహ్మద్‌ను నేడు ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో హాజరుపర్చారు. అదే సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్తుండగా కుమారుడిని తల్చుకొని అతీక్ దుఃఖించాడు. ‘నా బిడ్డ చావుకు నేనే కారణం’ అంటూ కన్నీరుపెట్టుకున్నాడు. అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని అధికారులను కోరాడు. 

ఉమేశ్ పాల్‌ హత్యకేసులో అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed) కుమారుడు అసద్‌ ప్రధాన నిందితుడు. ఈ హత్య తర్వాత నుంచి అసద్‌, అతీక్‌ అనుచరుడు గుల్హామ్‌ అదృశ్యమయ్యారు. తాజాగా వీరిద్దరూ ఝాన్సీలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు (UP Police), నిందితుల మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకొంది. ఆ కాల్పుల్లో అసద్‌, గుల్హామ్‌ హతమయ్యారు. ఇదిలా ఉంటే.. ఉమేశ్ పాల్‌ హత్య కేసులో ఓ షార్ప్‌ షూటర్‌, మరో నిందితుడిని కొన్నాళ్ల క్రితమే యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. 

సీఎంకు కృతజ్ఞతలు..: ఉమేశ్‌ పాల్‌ కుటుంబం

‘మా కుటుంబానికి న్యాయం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath)కు కృతజ్ఞతలు. మున్ముందు కూడా ఇలాగే న్యాయం అందాలని కోరుతున్నాం. సీఎంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది నా కుమారుడికి అందిన నివాళి’ అని ఉమేశ్‌ పాల్ తల్లి శాంతి దేవీ ఉద్వేగానికి గురయ్యారు. తండ్రి స్థానంలో ఉండి ఈ కుమార్తెకు న్యాయం చేసిన సీఎంకు కృతజ్ఞతలని ఉమేశ్‌ పాల్ భార్య జయాదేవీ అన్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని