Atiq Ahmad: అతీక్‌ రాసిన ‘రహస్య లేఖ’.. యూపీ సీఎం, సీజేఐల కోసమే!

హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ ‘రహస్య లేఖ’ విషయం ఉత్కంఠగా మారింది. ఏదైనా దుర్ఘటన జరిగితే, లేదా తాను హత్యకు గురైతే.. దాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం, భారత ప్రధాన న్యాయమూర్తికి పంపాలని.. మరణానికి ముందే అతీక్‌ దాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం.

Updated : 18 Apr 2023 17:08 IST

లఖ్‌నవూ: గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmad)తోపాటు అతని సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ను శనివారం కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ‘రహస్య లేఖ’ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకవేళ తాను మరణిస్తే.. ఆ లేఖను ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి (UP CM), భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)కి చేరవేయాలంటూ అతీక్‌ ముందుగానే సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆ లెటర్‌ (Atiq Letter)ను ఆ ఇద్దరికి పంపుతున్నట్లు అతీక్‌ తరఫు న్యాయవాది మంగళవారం వెల్లడించారు.

‘ఒకవేళ ఏదైనా దుర్ఘటన జరిగితే, లేదా తాను హత్యకు గురైతే.. సంబంధిత లేఖను ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తికి పంపాలని అతిక్ అహ్మద్ చెప్పారు. సీల్డ్ కవరులో ఉన్న ఆ లేఖ ప్రస్తుతం నా దగ్గర లేదు. వేరే వ్యక్తి దాన్ని చేరవేయనున్నారు. లేఖలోని విషయాలూ నాకు తెలియవు’ అని న్యాయవాది విజయ్ మిశ్రా మీడియాకు తెలిపారు. భారీ నేర సామ్రాజ్యాన్ని ఏలడంతోపాటు సుదీర్ఘ కాలం ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన అతీక్‌ అహ్మద్‌.. ఆ లేఖలో ఏం రాశాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా.. అతీక్ అహ్మద్ (60), అతని సోదరుడు అష్రఫ్‌లను వైద్య పరీక్షల కోసం పోలీసులు ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి తీసుకెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చిచంపారు. జర్నలిస్టుల్లా వచ్చిన సన్నీ సింగ్‌, లవ్లేశ్‌, అరుణ్ మౌర్యలు ఈ హత్యలకు పాల్పడ్డారు. అతీక్‌ను హత్యచేసి పేరు సంపాదించాలనే లక్ష్యంతోనే కాల్పులు జరిపామని నిందితులు వెల్లడించారు. ఇందులో ప్రధాన సూత్రధారిగా సన్నీ సింగ్‌ను భావిస్తున్నారు. అతీక్‌, అతడి సోదరుడిపై కాల్పులు జరిపేందుకు మిగతా ఇద్దరిని అతడే ఒప్పించినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని