Atique Ahmed: ఆ హత్యలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించండి.. సుప్రీంకోర్టులో పిటిషన్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల పోలీస్‌ కస్టడీలో ఉన్న సమయంలోనే గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌, ఆయన సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌లు హత్యకు గురయ్యారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ అతీక్‌ సోదరి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Updated : 27 Jun 2023 13:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల పోలీస్‌ కస్టడీలో ఉన్న సమయంలోనే గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ (Atique Ahmed), ఆయన సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌లు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ అతీక్‌ సోదరి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇవి ప్రభుత్వం చేయించిన హత్యలని ఆరోపించిన ఆమె.. దీనిపై రిటైర్డ్‌ జడ్జీతో దర్యాప్తు చేయించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతీకారంతోనే తమ కుటుంబసభ్యులపై అరెస్టులు, వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొంటూ అతీక్‌ సోదరి తరఫున న్యాయవాదులు సోమేష్‌ చంద్ర ఝా, అమర్త్యా ఆశీష్‌ శరణ్‌, ఐషా నూరీలు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా ఉన్న పోలీసులే వీటికి బాధ్యులని.., ఈ వ్యవహారంలో ఎటువంటి శిక్ష పడదనే భరోసాను యూపీ ప్రభుత్వం (Uttar Pradesh) అధికారులకు కల్పించినట్లు కనిపిస్తోందన్నారు.

అహ్మద్‌ సోదరుల హత్యపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ ఇప్పటికే పెండింగులో ఉంది. యూపీలో 2017 నుంచి ఇప్పటివరకు 183 ఎన్‌కౌంటర్లు జరిగాయాని.. వీటిపై దర్యాప్తు చేయించాలని కోరుతూ న్యాయవాది విశాల్‌ తివారీ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అంతేకాకుండా 2020లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌పైనా ప్రశ్నలు లేవనెత్తారు. ఇలాంటి పోలీసు చర్యలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తాయని అందులో పేర్కొన్నారు. అయితే, ఈ మరణాల విచారణకు సంబంధించి ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఇదిలాఉంటే, రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌లను ఏప్రిల్‌ 15న గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వైద్య పరీక్షల కోసం అతీక్‌, అష్రాఫ్‌లను ఒక వైద్య కళాశాలకు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మీడియా ప్రతినిధులు వారిని అనుసరిస్తూ ప్రశ్నలడుగుతున్న సమయంలోనే జర్నలిస్టుల రూపంలో వచ్చిన ముగ్గురు వారిపై తుపాకులతో అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. అతీక్‌ అహ్మద్‌ సమాజ్‌వాదీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని