Covid BF7: కొవిడ్‌ విజృంభిస్తోంది.. తస్మాత్‌ జాగ్రత్త: భారత వైద్యమండలి

ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్ని భారత వైద్య మండలి అప్రమత్తం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ఉపయోగించడం సహా కొవిడ్‌ నియంత్రణ పద్దతులను కచ్చితంగా అవలంబించాలని కోరింది

Published : 22 Dec 2022 15:25 IST

దిల్లీ:  కరోనా (Corona Virus) వ్యాప్తి మరోసారి కలకలం సృష్టిస్తోంది. పొరుగుదేశం చైనా (China) లో వేగంగా వ్యాప్తి చెందుతున్న బీఎఫ్‌7 (BF 7) రకానికి చెందిన ఒమిక్రాన్‌ (Omicron) కేసులు భారత్‌లోనూ నమోదు కావడంతో భారత వైద్యమండలి (IMA) ప్రజల్ని అప్రమత్తం చేసింది. కొవిడ్‌ నియంత్రణ పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని కోరింది.  బహిరంగ ప్రదేశాల్లో మాస్కు (Mask) ను కచ్చితంగా ఉపయోగించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవాలని కోరుతూ ప్రకటన విడుదల చేసింది. శానిటైజర్‌ ఉపయోగించాలని చెప్పింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ (Mansukh Mandaviya) లోక్‌సభలో మాట్లాడుతూ.. భారత్‌లో కొవిడ్‌ కేసుల పెరుగుదలపై కేంద్రం ఓ కన్నేసి ఉంచిందని చెప్పిన గంటల వ్యవధిలోనే ఐఎంఏ ఈ ప్రకటన జారీ చేయడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్‌గా నమూనాలను సేకరించి, పరీక్షించాలని మాండవీయ ఆదేశించిన నేపథ్యంలో ఆ ప్రక్రియ కూడా ఇవాళ్టి ఉదయం నుంచి ప్రారంభమైంది.

వీలైనంత వరకు ప్రజలు జనసమూహాలకు దూరంగా ఉండాలని, వివాహాలు, రాజకీయ, సామాజిక సమావేశాలను వాయిదా వేసుకోవడం మంచిదని ఐఎంఏ సూచించింది. అత్యవసరమైతే తప్ప, సాధ్యమైనంత వరకు అంతర్జాతీయ ప్రయాణాలు చేయొద్దని ప్రజలను కోరింది. జ్వరం, గొంతు నొప్పి, జలుబు, విరేచనాలు తదితర సమస్యలేమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది. కొవిడ్‌ ప్రికాషనరీ డోసు (ముందస్తు డోసు)ను వీలైనంత తొందరగా తీసుకోవాలని సూచించింది.‘‘ వివిధ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రజలను భారత వైద్యమండలి అప్రమత్తం చేస్తోంది. తక్షణమే కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రజల్ని కోరుతోంది. గడిచిన 24 గంటల్లో అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, ప్రాన్స్‌, బ్రెజిల్‌ తదితర దేశాల్లో 5.37లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ 145 కొత్తగా కేసులను గుర్తించారు. ఇందులో 4 కేసులు చైనాలో భయాందోళనలు సృష్టిస్తున్న బీఎఫ్‌7 రకానికి చెందినవి’’ అని ఐఎంఏ ప్రకటనలో పేర్కొంది.

2021 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్ని కేంద్రాన్ని కోరింది. అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్‌, అంబులెన్స్‌ సర్వీసులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, సంబంధిత విభాగాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎంఏ తన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు చైనా నుంచి వచ్చే ప్రయాణికులు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండేలా కేంద్ర చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని