Supreme Court: హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంలో బెయిల్‌ నిరాకరణ

మనీలాండరింగ్‌ కేసులో ఈసీ తనను అరెస్ట్‌ చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీం నిరాకరించింది.

Published : 22 May 2024 17:13 IST

దిల్లీ: మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం నిమిత్తం తనకు బెయిల్‌ మంజూరుచేయాలని సోరెన్‌ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. ఈసందర్భంగా కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ దీపాంకర్ దత్తా, జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మతో కూడిన వెకేషన్ బెంచ్‌.. సోరెన్‌ పిటిషన్‌పై అసహనం వ్యక్తంచేసింది. ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదన్న విషయాన్ని తమకు తెలపలేదని, కేసులో వాస్తవాలను దాచడానికి ప్రయత్నించారని ఆగ్రహించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తామని హెచ్చరించింది. దీంతో సోరెన్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

భూ కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఫిర్యాదును ట్రయల్‌ కోర్టు పరిశీలనలోకి తీసుకున్న తర్వాత హేమంత్‌ సోరెన్‌ అరెస్టు చెల్లుబాటుపై రిట్‌ కోర్టు విచారణ జరపటం సమంజసమేనా అనే అభిప్రాయం వ్యక్తంచేసింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేసుకు, సోరెన్ కేసుకు ఉన్న వ్యత్యాసాన్ని న్యాయస్థానం తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరుచేసిన సమయంలో ఆయన ట్రయల్ కోర్టు నుంచి రెగ్యులర్ బెయిల్‌ను కోరలేదని, కేసులో అతనిపై ఎటువంటి న్యాయపరమైన ఆదేశాలు రాలేదని వెకేషన్ బెంచ్ ఎత్తి చూపింది.  అయితే హేమంత్ సోరెన్‌ కేసులో జార్ఖండ్‌ ట్రయల్‌ కోర్టు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద సోరెన్‌ నేరాలను పరిగణలోకి తీసుకొని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిదని న్యాయస్థానం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని