Election Commission: బ్యాలెట్ల నుంచి ఈవీఎం వరకు.. 75 ఏళ్ల ఈసీ ప్రయాణమిలా..!

Election Commission: దాదాపు ఏడు దశాబ్దాల కిందట 1951లో దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందామా..!

Published : 29 Feb 2024 12:55 IST

దిల్లీ: 18వ లోక్‌సభ ఏర్పాటు కోసం సార్వత్రిక ఎన్నికల (Lok sabha Elections 2024) నిర్వహణకు సమాయత్తమవుతోంది కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission). ఎన్నికల తేదీలపై చర్చలు, ఈవీఎంల పరిశీలన వంటి పనుల్లో బిజీగా ఉంది. ఇంతకీ ఈసీ (EC)ని ఎప్పుడు ఏర్పాటుచేశారు..?గత 75 ఏళ్లలో ఎన్నికల నిర్వహణలో ఎలాంటి మార్పులొచ్చాయి..?

దేశం గణతంత్రంగా మారడానికి ఒక్క రోజు ముందు అంటే 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 17 సార్వత్రిక, అనేక అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎన్నికలనూ నిర్వహించింది. ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో పోలింగ్‌ ప్రక్రియలో సాంకేతికంగా అనేక మార్పులు వచ్చాయి. బ్యాలెట్‌ బాక్సుల (Ballot boxes) నుంచి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (EVM) శకంలోకి మారాం.

ఈసీ ప్రయాణం సాగిందిలా..

 • పశ్చిమబెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీగా విధులు నిర్వహించిన అప్పటి ఐసీఎస్‌ అధికారి సుకుమార్‌ సేన్‌.. కేంద్ర తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC)గా నియమితులయ్యారు.
 • ఈసీ ఏర్పాటైన దాదాపు రెండు నెలల తర్వాత 1950 మార్చి 21న ఆయన సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 1951-51, 1957లో జరిగిన తొలి రెండు సార్వత్రిక ఎన్నికలను ఈయనే పర్యవేక్షించారు.
 • భారత ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో సుకుమార్‌ సేన్‌ చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌లో ఉన్న విధివిధానాల్లో 80శాతం ఆయన తీసుకొచ్చినవే.
 • 1951-52లో 489స్థానాలకు జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో స్టీల్‌ బ్యాలెట్‌ బాక్సులను వినియోగించారు.
 • 70వ దశాబ్దం చివర్లో ఈవీఎంలను రూపొందించారు. 1999లో కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలకు వాటిని విస్తరించారు.
 • 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో 10లక్షలకు పైగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను వినియోగించారు.
 • తొలి ఎన్నికల నుంచే ఎన్నికల గుర్తులను తీసుకొచ్చారు. 1951-52 ఎన్నికల్లో గుర్తుల కోసం ఈసీ ఎంఎస్‌ సేథి అనే ఆర్టిస్ట్‌ను నియమించింది. రోజువారీ పనుల్లో ఉపయోగించే వస్తువులైతే ఓటర్లు సులువుగా గుర్తుపట్టడమే గాక, ఎక్కువ కాలం గుర్తుంచుకోగలరని ఆయన అధికారులకు తెలిపారు. ఇందుకోసం పెన్సిల్‌తో స్కెచ్‌లు వేశారు.
 • తొలి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 27,527 పోలింగ్‌ కేంద్రాలను మహిళలకు రిజర్వ్‌ చేశారు. ఆ తర్వాత నుంచి దివ్యాంగులకు వీల్‌ఛైర్‌ సౌకర్యం, అంధులకు బ్రెయిలీ ఓటర్‌ స్లిప్‌లు, బ్రెయిలీలో ఈవీఎంలు వంటి సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు.
 •  మాజీ సీఈసీ టీఎన్ శేషన్‌ హయాంలో 1993లో తొలిసారిగా ఓటరు గుర్తింపు కార్డుల జారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. తొలి నాళ్లలో సాధారణ పేపర్‌పై నల్ల సిరాతో ఓటర్‌ ఐడీలను ప్రింట్‌ చేసి లామినేట్‌ చేసేవారు. ఆ తర్వాత 2015 నుంచి కలర్‌ వెర్షన్‌లో డిజిటలైజ్డ్‌ ఫొటోతో ఈ గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నారు.
 • ఎన్నికల ప్రకియలో పారదర్శకతను మరింత మెరుగుపర్చేందుకు 2013లో ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (VVPAT)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 1961నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనల చట్టంలో సవరణలు చేశారు.
 • 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి ‘నోటా (None of the Above)’ ఓటు ఆప్షన్‌ను తీసుకొచ్చారు.
 • తొలి సార్వత్రిక ఎన్నికల్లో 17.3 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 నాటికి ఆ సంఖ్య 91.19 కోట్లకు పెరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 67.4 శాతం పోలింగ్‌ నమోదైంది.
 • ప్రస్తుతం దేశంలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఇటీవల ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ సమాయత్తమవుతోంది. మార్చి రెండోవారం తర్వాత షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని