Basavaraj Bommai: విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దు : బొమ్మై

కర్ణాటకలో నూతన విద్యావిధానాన్ని రద్దు చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated : 17 Aug 2023 12:24 IST

బెంగళూరు: కర్ణాటకలో అమలు చేస్తున్న నూతన విద్యావిధానాన్ని (NEP) వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తానని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించడంపై మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai)ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపించారు.

మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. దీనిపై విద్యార్థులు తిరుగుబాటు చేస్తారని బొమ్మై హెచ్చరించారు. ‘‘విద్యావిధాన పాలసీలో చిన్న మార్పులు చేస్తే ఫర్వాలేదు. కానీ, సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఏకంగా రద్దు చేస్తాననడం అర్థరహితం. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. వారి జీవితాలతో కాంగ్రెస్‌ రాజకీయాలు చేయకూడదు. దేశంలోని ఎంతోమంది మేధావులు ఏళ్ల కృషితో జాతీయ విద్యావిధానాన్ని రూపొందించారు. ఇది మైరుగైన విద్యా నిర్మాణం. విద్యార్థుల ఆసక్తి మేరకు సబ్జెక్టులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కలిగిస్తోంది. అటువంటి విద్యావిధానాన్ని రద్దు చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్‌ మూర్ఖత్వం’’అని అన్నారు.

హిమాచల్‌లో ఆగని వరద విలయం

రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా నేతలు చేస్తున్న ఆరోపణలను ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) తీవ్రంగా ఖండించారు. నూతన విద్యావిధానం కర్ణాటకలో మాత్రమే అమలులో ఉందని.. గుజరాత్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో ఎందుకు లేదని ప్రశ్నించారు. దివంగత నేత రాజీవ్‌ గాంధీ హయంలో ఉన్న విద్యావిధానాన్ని ఆయన ప్రశంసించారు. ప్రాథమిక విద్య, సాంకేతిక, ఉన్నత విద్య పరంగా ఎంతో ఉత్తమం అని కొనియాడారు. కాబట్టి, ఎన్‌ఈపీని అమలు చేయాల్సిన అవసరం లేదని.. ఇది కేవలం భాజపా రాజకీయ ఎత్తుగడ మాత్రమే అని ఆరోపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎన్‌ఈపీని రద్దు చేసి రాష్ట్ర విద్యా విధానం(ఎస్‌ఈపీ) అమలు చేస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా ఈ ఏడాది ఎన్‌ఈపీనే కొనసాగిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని