Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి

దిల్లీలోని విజయ్‌ చౌక్‌లో బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనికులు ప్రదర్శించిన విన్యాలు ఆకట్టుకుంటున్నాయి.

Published : 29 Jan 2023 18:03 IST

దిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు దిల్లీలో ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం  విజయ్‌చౌక్‌ వద్ద సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్‌ రీట్రీట్‌(Beating Retreat) కార్యక్రమం అలరిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సైనికులు ప్రదర్శించిన విన్యాసాలు భళా అనిపిస్తున్నాయి. బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకల్లో భాగంగా 3,500 దేశీయ డ్రోన్‌లతో అతి పెద్ద షో నిర్వహించనున్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు. విజయ్‌ చౌక్‌లో జరుగుతున్న ఈ గ్రాండ్‌ ఈవెంట్‌ సందర్భంగా నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌ల వద్ద డ్రోన్లతో ప్రత్యేక షో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆకాశంలోకి రివ్వున ఎగిరే డ్రోన్లు మువ్వన్నెల కాంతుల్ని విరజిమ్మి ప్రత్యేక ఆకృతుల్లో కనులవిందు చేయనున్నాయి. ఈ వేడుకల సందర్భంగా దిల్లీలో మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 9.30గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఈ బీటింగ్‌ రీట్రీట్‌ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని