Bengaluru cafe blast case: ఉగ్ర ‘కర్నల్‌’కు టచ్‌లో రామేశ్వరం కెఫే మాస్టర్‌మైండ్‌..!

రామేశ్వరం కెఫే పేలుడు కేసులో మాస్టర్‌ మైండ్‌ తాహా ఐసిస్‌ ఉగ్రసంస్థలో కీలక సభ్యుడిగా అనుమానిస్తున్నారు. అతడికి ‘కర్నల్‌’ పేరిట వ్యవహరించే ఓ ఉగ్రబాస్‌తో సంబంధాలున్నట్లు  తెలుస్తోంది. 

Published : 15 Apr 2024 16:09 IST

Bengaluru cafe blast case ఇంటర్నెట్‌డెస్క్‌: రామేశ్వరం కెఫే కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) లోతులకు వెళ్లే కొద్దీ ఒళ్లు జలదరించే నిజాలు బయటపడుతున్నాయి. ఈ దాడికి మాస్టర్‌ మైండ్‌గా భావిస్తున్న అబ్దుల్‌ మథీన్‌ అహ్మద్‌ తాహా భారత్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థకు చెందిన కీలకమైన వ్యక్తి (హైవేల్యూ అసెట్‌)గా అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితులను పశ్చిమబెంగాల్‌లో అరెస్టు చేశాక శుక్రవారం బెంగళూరుకు తీసుకొచ్చారు. వారిని రామేశ్వరం కెఫేకు తీసుకెళ్లి విచారణ నిర్వహించారు. ఇప్పటికే కోరమంగళలోని తాహా ఇంటికి వెళ్లి తనిఖీలు కూడా చేశారు. 

ఉగ్ర ‘కర్నల్‌’తో టచ్‌లో..

తాహా గతంలో 2022 నవంబర్‌లో మంగళూరు కుక్కర్‌ బాంబ్‌ కేసులో నిందితుడు. దీనికి ఐసిస్‌ నగదు సమకూర్చినట్లు అనుమానిస్తున్నారు. ఇక అదే ఏడాది శివమొగ్గలో జరిగిన పేలుళ్లలో కూడా ఇతడి హస్తం ఉంది. అంతకు ముందు 2020లో ‘అల్‌ హింద్‌ మాడ్యూల్‌’ కేసులో కూడా ఉన్నాడు. దక్షిణ, మధ్య భారత్‌లో జరిగిన అనేక ఉగ్రవాద కేసులతో సంబంధం ఉన్న ‘కర్నల్‌’ అనే వ్యక్తితో తాహా టచ్‌లో ఉన్నట్లు తేలింది. ఈనేపథ్యంలో తాహాతో కలిపి బాంబర్‌ షాజిబ్‌ను ఎన్‌ఐఏ ‘కర్నల్‌’ వివరాలపై ఇంటరాగేషన్‌ చేయనుంది. అతడు ఎవరు..? డబ్బు ఎలా పంపేవాడు..? అతడితో ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపై వివరాలు సేకరించనున్నారు. 

బ్లైండ్‌ స్పాట్ల కోసం రెక్కీ..

రామేశ్వరం కెఫేలో తాహానే స్వయంగా వారం రోజులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక్కడి బ్లైండ్‌ స్పాట్లు (సీసీకెమెరాలు చిత్రీకరించలేని ప్రదేశాలు) గుర్తించడమే లక్ష్యంగా దీనిని చేపట్టాడు. కెఫేలోకి బాంబర్‌ ఎటు నుంచి రావాలి.. ఎటునుంచి వెళ్లిపోవాలో కూడా నిర్ణయించింది ఇతడే అని తెలుస్తోంది. బాంబింగ్‌ తర్వాత తాను తమిళనాడు నుంచి.. షాజిబ్‌ బెంగళూరును నుంచి పరారయ్యేందుకు మార్గాలను ఎంపిక చేసి ఉంచుకొన్నాడు. 

పశ్చిమబెంగాల్‌లో ఎవరు సాయం చేశారు..?

ఈ కేసులో ప్రధాన నిందితులు తాహ, షాజిబ్‌లకు పశ్చిమబెంగాల్‌లో ఒకరు సాయం చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) భావిస్తోంది. రామేశ్వరం కెఫే కేసులో తొలుత చెన్నైలో అరెస్టైన ముజమ్మిల్‌ షరీఫే నిందితులకు లాజిస్టికల్‌ సపోర్ట్‌ అందించినట్లు అధికారులు చెబుతున్నారు. పేలుడు తర్వాత నిందితులు రాంచీలో వారం రోజులు బస చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కోల్‌కతాకు వెళ్లగా అక్కడ షరీఫ్‌ వారిని కలిసి నగదు అందించాడు. దీంతో వేర్వేరు హోటళ్లు మారుతూ నిందితులు కోల్‌కతాలోనే నక్కారు. దాడి తర్వాత తొలినాళ్లలో అప్రమత్తంగా ఉన్న నిందితులకు తర్వాత ధైర్యం వచ్చింది. షరీఫ్‌ ఇచ్చిన సొమ్ముతో తాహ, షాజిబ్‌ కోల్‌కతా, డార్జిలింగ్‌, పురులియా, డిఘాలో తిరిగారు. ఈసందర్భంగా మొత్తం నగదు రూపంలో చెల్లింపులు చేశారని అధికారులు చెప్పినట్లు ఓ ఆంగ్లపత్రిక పేర్కొంది. దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకొనేందుకు అవసరమైతే బంగ్లాదేశ్‌ పారిపోయేందుకు వీలుగా వీరు కోల్‌కతాను ఎంచుకొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 

 ఈ క్రమంలో 35 సిమ్‌లు, ఫేక్‌ ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సులతో దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కోల్‌కతాలోని ఎస్‌ప్లనేడ్‌ ప్రాంతంలో కొన్ని రోజులు బస చేశారు. ఈక్రమంలో ఓ నిందితుడి సెల్‌ఫోన్‌లో సమస్య తలెత్తింది. దాంతో అక్కడి చాంద్‌నీచౌక్‌ మార్కెట్లోని ఓ దుకాణంలో రిపేర్‌కు ఇచ్చారు. మైక్రోఫోన్‌లో ఏదైనా సమస్య ఉందా?అని తెలుసుకుందామనుకున్న దుకాణం యజమాని.. అతడి దగ్గరున్న ఓ సిమ్‌ కార్డును అందులో పెట్టి చూశాడు. అప్పటికే ఫోన్‌ను ట్రాక్‌ చేస్తున్న పోలీసులు.. సిమ్‌కార్డు సిగ్నల్స్‌తో అప్రమత్తమయ్యారు. మొబైల్‌ షాప్‌నకు చేరుకున్న దర్యాప్తు అధికారులు.. యజమాని నుంచి సమాచారం సేకరించారు.  చివరకు కోల్‌కతా శివారులోని దిఘా ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని