బెంగళూరు కేఫ్‌ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు

బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు నిందితుల ఆచూకీ చెప్పిన వారికి ఎన్‌ఐఏ రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది.

Updated : 29 Mar 2024 19:41 IST

దిల్లీ: బెంగళూరు (Bengaluru) బ్రూక్‌ఫీల్డ్‌లోని ‘రామేశ్వరం కేఫ్‌’లో బాంబు పేలుడు (Bengaluru cafe Blast) ఘటనపై విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిందితుల సమాచారం ఇచ్చిన వారికి రివార్డు ప్రకటించింది. ఇద్దరు నిందితులు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు భావిస్తున్న ఎన్‌ఐఏ.. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈమేరకు అధికారిక ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. మార్చి 1న జరిగిన కేఫ్‌లో బాంబు పేలుడులో పలువురు వినియోగదారులు, సిబ్బంది గాయపడిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనకు ముస్సావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌, అబ్దుల్‌ మథీన్‌ అహ్మద్‌లను కారకులుగా ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. కేఫ్‌లో బాంబు అమర్చింది షాజీబ్‌గా భావిస్తోంది. ఈ నిందితులిద్దరూ 2020 ఉగ్రదాడి కేసులోనూ వాంటెడ్‌ జాబితాలో ఉన్నారు. వీరి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే info.blr.nia@gov.inకు మెయిల్‌ చేయాలని ఎన్‌ఐఏ కోరింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది.

కేసు విచారణలో ఇప్పటికే పురోగతి సాధించిన ఎన్‌ఐఏ.. కీలక కుట్రదారుగా అనుమానిస్తోన్న ముజమ్మిల్‌ షరీఫ్‌ను గురువారం అరెస్టు చేసింది. మూడు రాష్ట్రాల్లో విస్తృత గాలింపు అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సోదాల్లో భాగంగా పలు డిజిటల్ పరికరాలను, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నిందితులకు షరీఫ్‌ పేలుడు పదార్థాలు, పరికరాలు సరఫరా చేసినట్లు ఎన్‌ఐఏ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని