Anand Mahindra: ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర పోస్ట్‌

Anand Mahindra: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదేనంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఓ చిత్రాన్ని పంచుకున్నారు. ఇంతకీ ఏంటా ఫొటో? ఎందుకంత స్పెషల్‌?

Published : 21 May 2024 15:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్ఫూర్తిమంతమైన కథనాలను పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) తన ఎక్స్‌ ఖాతాలో ఓ ఫొటో షేర్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha elections 2024) ఓటేసి ఒక చేతిలో ఓటరు కార్డు, వేలికి సిరా గుర్తు చూపిస్తున్న ఓ వ్యక్తి ఫొటో అది. అందులో ప్రత్యేకత ఏముంది? అనుకుంటున్నారా..! ఆయన దేశంలో అంతరించిపోతున్న అరుదైన తెగకు చెందిన వ్యక్తి మరి. తన జీవితంలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ ఫొటోను మహీంద్రా షేర్‌ చేస్తూ.. ‘‘నా వరకు 2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్‌ ఫొటో..! గ్రేట్‌ నికోబార్‌ (Great Nicobar Islands) దీవుల్లోని షోంపెన్‌ తెగ (Shompen tribe)లో ఉన్న మొత్తం ఏడుగురు వ్యక్తుల్లో ఈయన ఒకరు. తొలిసారిగా ఓటు వేశారు. ప్రజాస్వామ్యం ఎదురులేనిది.. ఎవరూ ఆపలేని శక్తి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనే అతిపెద్ద హక్కు అందరికీ అందుతోందంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

దేశంలోని చిట్టచివరి వ్యక్తినీ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం చేసేందుకు ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగానే అంతరించిపోతున్న ఆదివాసీ తెగలకు ఓటు హక్కు కల్పించడమే గాక.. రవాణా సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లోనూ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలా అండమాన్‌ నికోబార్‌ (Andaman and Nicobar)లోని గ్రేట్‌ నికోబార్‌ దీవుల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే షోంపెన్‌ తెగ ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోగలిగింది.

ఈ తెగలో మొత్తం ఏడుగురు సభ్యులు మాత్రమే ఉండగా వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ‘షోంపెన్‌ హట్‌’ పేరుతో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తొలి విడతలో భాగంగా ఏప్రిల్‌ 19న వీరు ఓటు వేశారు. ఈ చిత్రాలను అండమాన్‌ నికోబార్‌ దీవుల ఎన్నికల అధికారి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని