ఎమ్మెల్యే-ఐఏఎస్‌ వెడ్డింగ్‌.. 80 గ్రామాలకు ఆహ్వానాలు, లక్షల్లో అతిథులు..!

హరియాణా ఎమ్మెల్యే ఒకరు ఐఏఎస్‌ అధికారిణిని వివాహం చేసుకోబోతున్నారు. వారి వివాహానికి 80 గ్రామాలకు చెందిన ప్రజలను ఆహ్వానించనున్నారు. 

Updated : 09 Dec 2023 09:17 IST

దిల్లీ: హరియాణా (haryana) మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఒక ఐఏఎస్‌ అధికారిణిని వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబర్ 22న వీరి పెళ్లి జరగనుంది. విషయం ఇక్కడ వరకే ఉంటే.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ ఉండదు. కానీ ఈ వివాహానికి దిల్లీతో సహా రెండు రాష్ట్రాలకు ఆహ్వానాలు వెళ్లాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వివాహం జరుగుతుండగా.. పుష్కర్, అదంపుర్‌, దిల్లీ నగరాలు మూడు రిసెప్షన్‌లకు వేదిక కానున్నాయి. ఈ వేడుకల నిమిత్తం మూడు లక్షల మందికి ఆహ్వానాలు వెళ్లనున్నాయి. దీంతో ఇప్పుడు ఈ వివాహం చర్చనీయాంశంగా మారింది.

భవ్య బిష్ణోయ్‌కు ఐఏఎస్‌ అధికారిణి పరి బిష్ణోయ్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగింది. భవ్య.. అదంపుర్‌(Adampur) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తాత హరియాణా మాజీ ముఖ్యమంత్రి. తండ్రి కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ భాజపా నేత, మాజీ ఎంపీ. పరి బిష్ణోయ్‌ది రాజస్థాన్‌. ఆమె 2019లో సివిల్స్‌ సాధించారు. సిక్కిం క్యాడర్‌ కింద గ్యాంగ్‌టక్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.

యువతి రాష్ట్రమైన రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వివాహం జరగనుంది. అలాగే ఆ రాష్ట్రంలోని పుష్కర్‌ నగరంలో ఒక రిసెప్షన్ నిర్వహించనున్నారు. భజన్‌లాల్ కాలం నుంచి అదంపుర్‌(రిసెప్షన్‌ జరిగే వేదిక)లో బిష్ణోయ్ కుటుంబానికి పట్టుంది. దాంతో ఆ నియోజకవర్గంలోని 80కి పైగా గ్రామాలకు చెందిన ప్రజలను ఆహ్వానిస్తామని కుల్‌దీప్ ఓ మీడియా సంస్థతో వెల్లడించారు. ‘నా తండ్రి భజన్‌లాల్ కూడా నా వివాహం సమయంలో అన్ని ఊర్లు తిరిగి ప్రజలను ఆహ్వానించారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు నేనూ అదే చేయబోతున్నా’ అని తెలిపారు. దిల్లీ రిసెప్షన్‌కు పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖులు హాజరవుతారని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. భవ్య బిష్ణోయ్‌కు 2021లో సినీనటి మెహ్రీన్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే కొద్దినెలలకే వారి ఎంగేజ్‌మెంట్ రద్దయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు