నవంబర్ 17వరకు ఎంజాయ్ చేయండి: బెట్టింగ్ యాప్ వివాదం వేళ భాజపాపై బఘేల్‌ విమర్శలు

బెట్టింగ్‌ యాప్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌(Bhupesh Baghel) విమర్శించారు.

Published : 06 Nov 2023 17:00 IST

రాయ్‌పుర్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో మహాదేవ్‌ బెట్టింగ్ యాప్ కలకలం సృష్టిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌(Bhupesh Baghel) స్పందిస్తూ.. నవంబర్ 17 వరకు ఎంజాయ్‌ చేయండంటూ భాజపా విమర్శలను తిప్పికొట్టారు. ఈ బెట్టింగ్‌ యాప్‌ను చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (Mahadev Betting App Row)

‘భాజపా నవంబర్‌ 17 వరకు ఎంజాయ్ చేయగలదు. ఈ ఆరోపణలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవు. ఎన్నికలను ప్రభావితం చేసే ఇలాంటి ప్రయత్నాలను ఎన్నికల సంఘం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. మేం దీనిపై ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చడంపై విచారణ జరగాలి. ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒకసారి వాటిని పరిశీలించాలి’ అని బఘేల్‌ మీడియాతో మాట్లాడారు.

కాలుష్యం ఎఫెక్ట్‌.. దిల్లీలో మళ్లీ ‘సరి-బేసి’ విధానం..

ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నబెట్టింగ్‌ యాప్‌ యజమాని యాప్‌ ఓనర్‌ శుభమ్‌ సోని (Shubham Soni) మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ యాప్‌ను రూపొందించేందుకు భూపేశ్‌ తనను ప్రోత్సాహించారని శుభమ్‌ సోని ఆరోపించాడు. ఇప్పటివరకు ఆయనకు రూ. 508 కోట్లు చెల్లించానంటూ పేర్కొన్నాడు. బెట్టింగ్‌ యాప్‌నకు అసలైన ఓనర్‌ ఆయనేనని (సీఎంను ఉద్దేశిస్తూ) వీడియోలో పేర్కొన్నాడు. భిలాయ్‌లో తన సహచరులు అరెస్టు అయినప్పుడు.. సీఎం తనని యూఏఈకి పారిపోవాలని సలహా ఇచ్చిన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈడీ చర్యలు ప్రారంభించిందని.. ఈ వ్యవహారం నుంచి తనని బయటపడేయాలంటూ భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ఇక, ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో నవంబర్‌ 7న మొదటిదశ పోలింగ్ జరగనుంది. 17న రెండో దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్ మూడున ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని