Nitish kumar: 1.78లక్షల టీచర్‌ పోస్టుల భర్తీకి నీతీశ్‌ కేబినెట్‌ ఆమోదం

Eenadu icon
By National News Team Updated : 02 May 2023 20:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

పట్నా: బిహార్‌(Bihar) సీఎం నీతీశ్ కుమార్‌(Nitish Kumar) సారథ్యంలోని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 1.78లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం ఉద్యోగాల్లో 85,477 ప్రైమరీ టీచర్‌ పోస్టులు ఉండగా.. 1,745 మాధ్యమిక, 90,804 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా కేబినెట్‌ సెక్రటేరియట్‌ అదనపు చీఫ్‌ సెక్రటరీ ఎస్‌.సిద్దార్థ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.78లక్షల ఉపాధ్యాయ పోస్టుల  భర్తీకి సంబంధించిన ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదించినట్టు వెల్లడించారు. ఈ పోస్టులను బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేస్తామన్నారు. అతి త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించి ఈ ఏడాది చివరి నాటికే పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలిసి మహాకూటమిగా ఏర్పడి నీతీశ్ కుమార్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

దీంతో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ 30 (అర్ధరాత్రి) నుంచి గయ, ముజఫర్‌పూర్‌లలో 15 ఏళ్లు దాటిన అన్ని కమర్షియల్‌ వాహనాలు, డీజిల్‌తో నడిచే బస్సులు, ఆటోల కార్యకలాపాలను నిషేధించాలనే రవాణాశాఖ ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని సిద్ధార్థ్‌ వెల్లడించారు. ఈ రెండు నగరాల్లో డీజిల్‌ బస్సులు/ఆటోల యజమానులు సీఎన్‌జీకి మారేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పట్నాలో ఈ విధానం అమలు చేసేందుకు రవాణాశాఖ సర్క్యులర్‌ జారీ చేయగా.. తాజాగా ఈ రెండు నగరాల్లోనూ అదే తరహాలో 15 ఏళ్లు దాటిన డీజిల్‌ బస్సులు/ఆటోల కార్యకలాపాలపై నిషేధానికి సంబంధించి తాజాగా కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Tags :
Published : 02 May 2023 20:27 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని