Viral news: వీళ్లేం పోలీసులు.. ప్రమాదస్థలికి వెళ్లి ఇదేం పని!

రోడ్డు ప్రమాదం జరిగిన చోటుకి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని కాల్వలో పడేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో చోటు చేసుకుంది.

Published : 08 Oct 2023 20:25 IST

పట్నా: ఏదైనా ప్రమాదమో, దొంగతనమో జరిగితే వెంటనే పోలీసులకు ఫోన్‌ చేస్తాం. వాళ్లు ఘటనా స్థలికి వస్తే.. ఎంతో ధైర్యంగా ఉంటుంది. కచ్చితంగా న్యాయం జరుగుతుందని భావిస్తాం. కానీ, బిహార్‌లోని (Bihar) ముజఫర్‌పుర్‌లో (Muzaffarpur) పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. రోడ్డు ప్రమాదం జరిగిన చోటుకి వెళ్లిన పోలీసులు.. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మృతదేహాన్ని కాల్వలో పడేయడం చర్చనీయాంశమైంది. న్యాయం జరిగేలా చూడాల్సిన పోలీసులు, కనీస మానవత్వం లేకుండా వ్యవహరించడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. అటువైపుగా వెళ్తున్న వారు ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

మరోవైపు ఆ పోలీసుల తీరును సీనియర్‌ అధికారులు వెనకేసుకురావడం గమనార్హం. ప్రమాదంలో మృతదేహం పూర్తిగా ఛిద్రమైందని, కొన్ని శరీరభాగాలను రికవరీ చేయడానికి సాధ్యం కాకపోడంతోనే వాటిని కాల్వలో పడేశారని మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆగమేఘాల మీద కాల్వలోని మృతదేహాన్ని వెలికి శవాగారంలో భద్రపరిచారు. ఈ ఘటనకు పాల్పడిన పోలీసులపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. డ్రైవర్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా మరో ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని