Bridge Collapse: బిహార్‌లో 16మంది ఇంజినీర్లపై సస్పెన్షన్‌ వేటు

Eenadu icon
By National News Team Published : 05 Jul 2024 20:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

(ప్రతీకాత్మక చిత్రం)

పట్నా: బిహార్‌లో గత కొద్దిరోజులుగా వరుసగా బ్రిడ్జ్‌లు కూలిపోతున్న(Bihar Bridge Collapse) నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన 16 మంది ఇంజినీర్లను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వంతెనల నిర్మాణానికి బాధ్యులైన కాంట్రాక్టర్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని బిహార్ అభివృద్ధి కార్యదర్శి చైతన్య ప్రసాద్ పేర్కొన్నారు. గుత్తేదారులకు అప్పగించిన పనులను సరిగా నిర్వర్తించలేదని, అదే సమయంలో ఇంజినీర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని పేర్కొన్నారు.

బిహార్‌లో 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోవడం (Bihar Bridge Collapse)పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పాత వంతెనల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన వాటికి తక్షణ మరమ్మతులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వంతెనల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను తయారు చేయాలని నీతీశ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు డిప్యూటీ సీఎం చౌదరి  తెలిపారు. 

ఈ వరుస ఘటనలపై  రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్ స్పందిస్తూ ‘‘జూన్‌ 18 నుంచి ఇప్పటి వరకు బిహార్‌లో 12 వంతెనలు కూలిపోయాయి. వీటిపై ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, ప్రధాని మోదీ గానీ స్పందించట్లేదు. ఇద్దరూ మౌనంగా చూస్తూ ఉన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తాం అని అన్న మాటలు ఇప్పుడు ఏమయ్యాయి? రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎంత ప్రబలంగా ఉందో వీటిని చూస్తే అర్థమవుతోంది’’ అంటూ ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు. 

తాజాగా ఈ వరుస ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ మాట్లాడుతూ ఇది రుతుపవనాల కాలం కాబట్టి అసాధారణ వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్లే బ్రిడ్జ్‌లు కూలుతున్నాయని చెప్పిన మాటలు ప్రజలను నివ్వెరపరుస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని