US: పక్షులు నిజమైనవి కావట.. రోబోలట!

సాంకేతికత పెరిగిన తర్వాత ఏ సమాచారమైనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మధ్య కాలంలో సంప్రదాయ సమాచార మాధ్యమాలతోపాటు సోషల్‌మీడియాలో బోలేడు సమాచారం లభిస్తోంది. ఈ క్రమంలో వాస్తవాలకంటే అవాస్తవ వార్తలు, ఉద్దేశపూర్వకంగా అల్లిక కట్టుకథలు.. సిద్ధాంతాలు వైరల్‌

Published : 13 Jul 2021 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికత పెరిగిన తర్వాత ఏ సమాచారమైనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మధ్య కాలంలో సంప్రదాయ సమాచార మాధ్యమాలతో పాటు సోషల్‌మీడియాలో బోలెడు సమాచారం లభిస్తోంది. ఈ క్రమంలో వాస్తవాలకంటే అవాస్తవ వార్తలు, ఉద్దేశపూర్వకంగా అల్లిన కట్టుకథలు.. సిద్ధాంతాలు వైరల్‌ అవుతున్నాయి. భూమి గుండ్రంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపించినా.. బల్లపరుపుగా ఉంటుందన్న సిద్ధాంతాన్ని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వాటిల్లో ఒకటే ‘బర్డ్స్‌ ఆర్‌ నాట్‌ రియల్‌(పక్షులు నిజమైనవి కావు)’ సిద్ధాంతం. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకున్నా.. లక్షల మంది అమెరికన్లు ఈ సిద్ధాంతాన్ని నమ్మడమే కాదు.. పక్షులను చంపొద్దని, అమెరికన్ల వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించవద్దంటూ ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించారు. 

ఏంటీ.. బర్డ్స్‌ ఆర్‌ నాట్‌ రియల్ సిద్ధాంతం?

అమెరికాలో 1950కాలంలో అప్పటి సీఐఏ(సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ) దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని భావించిందట. భద్రతా సిబ్బంది, కెమెరాలు ఏర్పాటు చేసినా.. వాటి పరిధిలో మాత్రమే రక్షణ కల్పించగలం. అంతకు మించి నిఘా పెట్టాలంటే రోబో పక్షులను తయారు చేయాలని సీఐఏ భావించిందట. ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా.. ప్రకృతిలో మమేకమైన పక్షులను చంపేసి వాటి స్థానంలో రోబో పక్షులను వదలాలని నిర్ణయించిందట. ఇందుకోసం భారీ ఆపరేషన్‌ చేపట్టిందని ఈ సిద్ధాంతం చెబుతోంది. 

పక్షులను చంపాల్సిన అవసరమేముంది అని అంటే.. అందుకు ఒక కారణముందట. అధికారుల ఖరీదైన కార్లపై పక్షులు రెట్టలు వేయడంతో వాటిని అంతం చేయాలని సీఐఏ సంకల్పించిందని చెబుతుంటారు. 1959 నుంచి 2001 వరకు అమెరికా వ్యాప్తంగా దాదాపు 12బిలియన్‌ పక్షుల్ని చంపి.. వాటి స్థానంలో రోబో పక్షుల్ని తీసుకొచ్చారని ఈ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తులు ఆరోపిస్తున్నారు. ఈ రోబో పక్షులు పవర్‌లైన్స్‌పై కూర్చొని వాటంతట అవే ఛార్జింగ్‌ చేసుకుంటాయని చెబుతున్నారు.

సోషల్‌ మీడియా.. వెబ్‌సైట్‌.. ఉద్యమం

బర్డ్స్‌ ఆర్‌ నాట్‌ రియల్‌ అనే వెబ్‌సైట్‌లో ఈ సిద్ధాంతానికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపర్చారు. అయితే, ఎలాంటి ఆధారాలు లేకున్నా.. కొన్ని కాకతాళీయమైన సందర్భాలను.. వార్తలను కలిపేసి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారని మరికొందరు వాదిస్తున్నారు. సోషల్‌మీడియాలోనూ ఈ సిద్ధాంతం బాగా పాపులరైంది. ఇన్‌స్టాలో 3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్‌లో వేల మంది ఈ పేజీని ఫాలో అవుతున్నారు. ఫేస్‌బుక్‌లోనూ భారీగా స్పందన వస్తోంది. దీంతో నిజమైన పక్షులను చంపి, రోబోలను వదలడంపై ఈ సిద్ధాంతం ఫాలోవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని ప్రారంభించారు. 

2017లో తొలిసారి టెన్నెస్సీ లోని యూనివర్సిటీ ఆఫ్‌ మెంఫిస్‌కు చెందిన ప్రొఫెసర్‌ మెక్‌ ఇండో తొలిసారి ఓ ర్యాలీలో అమెరికాలో ఉన్నవి నిజమైన పక్షులు కావంటూ ప్లకార్డు పట్టుకొని కనిపించాడు. లాక్‌డౌన్‌ సమయంలో అంతా ఆన్‌లైన్‌మయం అయ్యేసరికి.. ఈ సిద్ధాంతం పట్ల చాలా మంది నెటిజన్లు ఆకర్షితులయ్యారు. కరోనా ఆంక్షలు సడలించడంతో ఇటీవల మిస్సోరిలోని స్ప్రింగ్‌ఫీల్డ్‌లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అమెరికన్లను రోబో పక్షులు గమనిస్తున్నాయని, వ్యక్తిగత జీవితాలపై అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. దీంతో మరోసారి ఈ సిద్ధాంతం వైరల్‌గా మారింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని