Udta Bengaluru: రేవ్‌ పార్టీపై రగడ.. ‘ఉడ్తా బెంగళూరు’పై కన్నడనాట మాటల యుద్ధం

సిలికాన్‌ సిటీ (Silicon City)ని ఉడ్తా బెంగళూరుగా మార్చారని ఆరోపించిన భాజపా.. రేవ్‌ పార్టీలు, మాదక ద్రవ్యాలకు నగరాన్ని అడ్డాగా మార్చారని మండిపడింది.

Published : 24 May 2024 19:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన రేవ్‌ పార్టీ ఉదంతం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని సిద్ధరామయ్య ప్రభుత్వంపై భాజపా విమర్శలు చేసింది. సిలికాన్‌ సిటీ (Silicon City)ని ఉడ్తా బెంగళూరుగా మార్చారని ఆరోపించిన కాషాయ నేతలు.. రేవ్‌ పార్టీలు, మాదక ద్రవ్యాలకు నగరాన్ని అడ్డాగా మార్చాయని మండిపడింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. నగర ప్రతిష్ఠను దిగజార్చే విధంగా మాట్లాడటం సరికాదని హితవు పలికింది.

‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత బెంగళూరులో ఎక్కడ చూసినా అసాంఘిక కార్యకలాపాలు వెలుగు చూస్తున్నాయి. శాంతి భద్రతలు క్షీణించాయి. సిలికాన్‌ నగరం.. రేవ్‌ పార్టీలు, డ్రగ్స్‌తో నిండిపోయింది’’ అని కర్ణాటక భాజపా తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంలతో కూడిన ఓ పోస్టర్‌ను షేర్‌ చేసింది. రాజధానిని ‘ఉడ్తా బెంగళూరు’గా పేర్కొన్న భాజపా.. సిలికాన్‌ సిటీ మాదకద్రవ్యాలకు అడ్డాగా మారిందని మండిపడింది. పంజాబ్‌లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఎత్తిచూపుతూ కొన్నేళ్ల క్రితం ‘ఉడ్తా పంజాబ్‌’ పేరుతో బాలీవుడ్‌లో సినిమా వచ్చింది.

ప్రజ్వల్‌ రేవణ్ణను విదేశాలకు పంపిందే దేవెగౌడ: సిద్ధరామయ్య

బెంగళూరుపై భాజపా చేసిన ఆరోపణలను రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర తప్పుపట్టారు. మాదకద్రవ్యాల వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఇప్పటికే రూ.కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేసి ధ్వంసం చేశామని చెప్పారు. అనేకమంది విదేశీయులను వెనక్కి పంపించివేశామన్నారు. ఉడ్తా బెంగళూరు అనే పదాన్ని ప్రతిపక్ష భాజపా ఉపయోగించడం సరికాదన్నారు.

బెంగళూరులో ఓ ఫామ్‌ హౌస్‌లో ఇటీవల నిర్వహించిన రేవ్‌ పార్టీపై దాడి చేసిన పోలీసులు.. 103 మందిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తేలింది. దీనిలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఉన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు