Siddaramaiah: ప్రజ్వల్‌ రేవణ్ణను విదేశాలకు పంపిందే దేవెగౌడ: సిద్ధరామయ్య

లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రజ్వల్‌ రేవణ్ణను ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడే విదేశాలకు పంపించారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు.

Published : 24 May 2024 17:53 IST

బెంగళూరు: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడు, హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను (prajwal revanna) హెచ్చరిస్తూ ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) విడుదల చేసిన ప్రకటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనే రేవణ్ణను విదేశాలకు పంపించారని ఆరోపించారు. దేవెగౌడ సూచనలు, సహకారంతోనే ప్రజ్వల్‌ జర్మనీ వెళ్లారని ఆక్షేపించారు. కేవలం ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకునేందుకే ఆయన ప్రకటన చేశారని విమర్శించారు.

మరోవైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) కూడా మాజీ ప్రధాని ప్రకటనపై స్పందించారు. ఇది పూర్తిగా దేవెగౌడ కుటుంబ అంశమని, అందులో తాను జోక్యం చేసుకోనని అన్నారు. చట్ట ప్రకారం దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఈ కేసుపై కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణ చేపడుతోంది. దీనికి సహకరించకుండా రేవణ్ణ విదేశాలకు పారిపోవడాన్ని తప్పుబడుతూ దేవెగౌడ గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడున్నా దేశానికి వచ్చి పోలీసులకు లొంగిపోవాల్సిందిగా రేవణ్ణను ఆయన హెచ్చరించారు.

ప్రజ్వల్‌కు కేంద్ర హోంశాఖ షోకాజ్‌ నోటీసులు

ప్రజ్వల్‌ రేవణ్ణ విదేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన దౌత్య వీసాను రద్దు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రజ్వల్‌ పాస్‌పోర్టు రద్దు చేసేందుకు అవసరమైన చర్యలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ పాస్‌పోర్టు రద్దయితే.. ఆయన విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధం. ఇప్పటికే రెడ్‌కార్నర్, బ్లూకార్నర్‌ నోటీసులు, కోర్టు ద్వారా అరెస్టు వారెంటు జారీ చేసినా ప్రజ్వల్‌  వెనక్కి రాలేదు. ఏప్రిల్‌ 26న అర్ధరాత్రి దాటిన అనంతరం ఆయన బెంగళూరు నుంచి గుట్టుగా జర్మనీకి జారుకున్నారు. అక్కడినుంచి లండన్‌కు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని